Aug 06,2023 09:51

రంగనాధం ఒక వ్యాపారి. ఓ రోజు తనకు నమ్మకమైన మిత్రుడు ఫోను చేసి, తక్కువ ధరకే కర్పూరం సరుకు వస్తోందని, వచ్చేది పండగ కాలం కాబట్టి రేటు బాగా పెరిగి వ్యాపారం బాగా అవుతుందని చెప్పాడు. మిత్రుడి మాటలను నమ్మిన రంగనాథం ఒకేసారి పది లారీల కర్పూరం తెప్పించాడు. అయితే రేటు పెరగకపోగా బాగా తగ్గిపోయింది. ఆ సరుకును ఎలాగైనా సొమ్ము చేసుకోవాలని ఓ ఉపాయం ఆలోచించాడు. అది ఫలించి అనుకున్న గడువుకంటే ముందుగానే కర్పూరం అమ్ముడైపోయింది.
        ఒకరోజు రంగనాధం భార్య 'ఏమండోరు రేపు శుక్రవారం ఉదయాన్నే కర్పూరం దిష్టి తీసిందాక బయటకు వెళ్ళకండి. అలా వెళితే మగవాళ్ళకు ప్రమాదమట' అంది. అది విన్న రంగనాధం, ఫక్కున నవ్వి, 'పిచ్చిదానా, నా మిత్రుడి మాట నమ్మి, రేటు పెరుగుతుందని, పది లారీల కర్పూరం కొని మన గోదాములలో దాచాను, రేటు పెరగ లేదు, సరికదా తగ్గింది, అందుకే శుక్రవారం కర్పూరంతో దిష్టి తీయకపోతే భర్తలకు ప్రా ణగండం అని పుకారు పుట్టించా. ఇంకేముంది గోదాములలో దాచిన కర్పూరం అంతా రెట్టింపు వెలకు అమ్ముడు పోయింది.
       'అమ్మవారు కళ్లు తెరిచింది', 'గణపతి పాలు తాగుతున్నాడు' అంటే పరుగులు తీసే జనం బలహీనతను, మాలాంటి వ్యాపారులు ఇలా సొమ్ము చేసుకోవడం చాలాకాలం నుండి జరుగుతున్నదే. మట్టితో చేసిన విగ్రహం నీటిని పీల్చుకుంటుందన్న ప్రకృతి సహజమైన ప్రక్రియకు మూఢనమ్మకం ఆపాదిస్తే జనం పిచ్చివాళ్లవుతున్నంత కాలం మాలాంటి వాళ్ల వ్యాపారాలకు ఏమాత్రం ఢోకాలేదు' అని చెప్పాడు. వ్యాపారి తన వస్తువులు అమ్ముకునేందుకు సవాలక్ష చెబుతాడు.. ఏది మంచో.. చెడో ప్రజలే ఆలోచించాలి' అంటున్న రంగనాధం వంక అయోమయంగా చూస్తూ అతని భార్య లోపలికి వెళ్లింది.
 

- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.