- ప్రముఖ సినీ రచయిత సముద్రాల జూనియర్ 38వ వర్ధంతి సభ
ప్రజాశక్తి-బాపట్ల : అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అంటూ తెలుగు సినీ సాహిత్య ప్రియులను అలరించిన సముద్రాల రామానుజాచార్య (జూనియర్ సముద్రాల ) సీనియర్ సముద్రాలగా మన్ననలు పొందిన ప్రముఖ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్య తనయుడని రావూరి నరసింహ వర్మ తెలియజేశారు . సాహితి భారతి ఆధ్వర్యంలో జరిగిన సముద్రాల రామానుజాచార్య 38వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. జూనియర్ సముద్రాల దాదాపు 70 చిత్రాలకు రచన చేశారని 500 పైచిలుకు పాటలు రచించారని తెలియజేశారు .జూనియర్ సముద్రాల పయనించే ఓ చిలుకా, జయ కృష్ణా ముకుందా మురారి ,అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా, రాగాలా సరాగాల, శ్రీకర కరుణాలవాల ,అందాల రాణివే వంటి అద్భుతమైన గీతాలు రచించారని ఆదం షఫీ కొనియాడారు .సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరోగా అభిమానుల చేత కొనియాడ పడ్డారని మర్రి మాల్యాద్రి రావు ప్రశంసించారు. వారు దాదాపు 340 చిత్రాల వరకు నటించారని, పద్మాలయ స్టూడియోను కూడా స్థాపించి చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రముఖ నటులు మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి గూడచారి , తొలి కౌబాయ్ , తొలి సినిమాస్కోప్ , తొలి 70ఎంఎం చిత్రాలను నిర్మించి వినూత్న ప్రభంజనాన్ని కృష్ణ సృష్టించారని పేర్కొన్నారు. మోసగాళ్లకు మోసగాడు, సాక్షి ,అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం వంటి మరుపురాని చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు .ఈ సభలో ఎన్ కృష్ణ ఎం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.










