ప్రజాశక్తి-బాపట్ల : తెలుగు నవలా సామ్రాజ్యాన్ని దాదాపు మూడు నాలుగు దశబ్జాలపాటు ఏకధాటిగా ఏలిన నవలా సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి అని వారు దాదాపు 75 నవలలు రచించారని వారు రచించిన మీనా, సెక్రటరీ,జీవన తరంగాలు, విచిత్రబంధం, బంగారు కలలు, జై జవాన్ మొదలగు నవలలు సినిమాలుగా కూడా నిర్మించబడ్డాయని సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన యద్దనపూడి సులోచనారాణి 5వ వర్ధంతి సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహా వర్మ వివరించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సులోచన రాణి మధ్యతరగతి కుటుంబాలలోని బాంధవ్యాలు ఆత్మీయతానురాగాలు ఆత్మస్థైర్యాలకు అక్షర రూపాన్ని ఇచ్చారని వారు రచించిన కీర్తి కిరీటాలు నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ఆత్మగౌరవం, కాంచన గంగ చిత్రాలకు నంది అవార్డులు ప్రధానం చేయబడ్డాయని తెలియజేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ వారు రచించిన ఋతురాగాలు, రాధా మధు, ఆగమనం, అగ్నిపూలు, కెరటాలు వంటి టీవీ సీరియల్స్ తెలుగు వీక్షక లోకాన్ని మంత్రముగ్ధులను చేశాయని కొనియాడారు. ఈ సభలో ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, తదితరులు యద్దనపూడి సులోచనారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.










