Oct 08,2022 23:30
  • ఇద్దరు విఆర్‌ఒలు, మాజీ తహశీల్దార్‌ కూడా..
  • - అక్రమ భూ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో రిమాండ్‌

ప్రజాశక్తిా చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ భూ రిజిస్ట్రేషన్ల చేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సహకరించిన సబ్‌ రిజిస్టార్‌, ఇద్దరు విఆర్‌ఒలు, మాజీ తహశీల్దార్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తన భూమిని కబ్జా చేశారని చిత్తూరు పట్టణం కట్టమంచి పంచాయతికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఎస్‌పి రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్‌పి పర్యవేక్షణలో వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అనంతరం అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన సబ్‌రిజిస్టార్‌ శ్రీధర్‌గుప్తా, విఆర్‌ఒలు ధనుంజయ, శివనారాయణ బాబు, చిత్తూరు, యాదమరి మండలంలో పనిచేసిన మాజీ తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. కట్టమంచి పంచాయతీలోని సర్వే నం. 459/1లో ఉన్న 5.71 ఎకరాల భూమిని 1981లో బాధితుడి తండ్రి పేరుమీద రిజిస్ట్రేషన్‌ అయిన భూమి అప్పటి నుంచి మ్యూటేషన్‌ జరగలేదని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు గుర్తించి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలోని కొందరి సహయంతో ఈ భూమిని వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.