ప్రజాశక్తి : భారతీయ సాహిత్యంలో తెలుగు కథను ఉన్నత శిఖరానికి చేర్చిన కథకుడు కేతువిశ్వనాథరెడ్డి మరణం తీరని లోటని సాహితీస్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్షులు కెంగార మోహన్ లు సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. సాహితీస్రవంతికి ప్రారంభం నుంచి తోడ్పాటునందించి సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో అనేక కథలు వ్యాసాలు అందించారని తెలిపారు. కథాసాహిత్యంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేశారని, అభ్యుదయ రచయితల ఉద్యమంలో విశాలాంధ్ర ప్రచురణాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారని అన్నారు. పాఠ్యపుస్తకాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయ సిలబస్ ను రూపొందించడంలో, భాష, మాండలిక ప్రయోగాల అధ్యయనంలో, రాయలసీమ వేదనలకు అక్షరరూపమివ్వడంలో ఆయనది గొప్ప ముద్ర అని తెలిపారు. కేతువిశ్వనాథరెడ్డి మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.










