Aug 01,2023 13:53

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగంగా ఊరేగించిన వీడియో విడుదల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. మణిపూర్‌ హింసపై కేంద్రం తగిన చర్యలు తీసుకోకుంటే తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సిజెఐ డి.వై చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ రచయిత, ప్రచురణకర్త బద్రి శేషాద్రి తప్పుపట్టారు. కేంద్రాన్ని ప్రశ్నించడానికి, అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి న్యాయమూర్తులకు మణిపూర్‌ వాస్తవిక పరిస్థితులపై అవగాహన ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్‌లో తుపాకి పట్టుకుని నిలబడడానికి సిజెఐ ధైర్యం చేస్తారా? అని శేషాద్రి డివై చంద్రచూడ్‌ని ప్రశ్నించినట్లు సౌత్‌ వెస్ట్‌ అనే యూట్యూబ్‌ న్యూస్‌ నివేదించింది. దీనిపై స్పందించిన స్టాలిన్‌ ప్రభుత్వం... వెంటనే బద్రి శేషాద్రిని అరెస్టు చేసింది. అయితే, శేషాద్రి అరెస్టుపై రచయితలు, కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది ప్రముఖ రచయితలు, చరిత్రకారులు, కళాకారుల బృందం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాసింది. డివై చంద్రచూడ్‌పై శేషాద్రి చేసిన వ్యాఖ్యలు నిస్సందేహంగా ఖండించదగ్గవే. కానీ అతన్ని అరెస్టు చేయడం భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం' అని రచయితల బృందం స్టాలిన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ఈ లేఖపై రచయితలు అంబై, పాల్‌ జకారియా, పెరుమాళ్‌ మురుగన్‌, సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ, చరిత్రకారులు ఎ.ఆర్‌. వెంకటాచలపతి, స్టాలిన్‌ రాజాంగం, సబాల్టర్న్‌, రాజన్‌ కృష్ణన్‌, ప్రొఫెసర్‌ కన్నన్‌ సుందరం సంతకం చేశారు.