Oct 05,2023 21:36

స్టాకహేోం : ఈ ఏడాది నార్వే రచయిత జాన్‌ ఫోసెను నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. మాటల్లో చెప్పలేని వాటికి గళాన్ని అందించేలా ఆయన రచించిన వినూత్న నాటకాలు, గద్యాలకు గాను ఈ బహుమతిని అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ గురువారం ప్రకటించింది. నార్వే పశ్చిమ తీరంలో 1959లో జన్మించిన ఫోసెకు చిన్న నాటి నుంచే రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి వుంది. నాటకాలు, నవలలు, పద్యాలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, సంకలనాలు ఇలా అన్ని రకాల సృజనాత్మక వ్యాసంగాన్ని ఆయన కొనసాగించారు. 'ఫోసె మినిమలిజం'గా పిలవబడే రచనా శైలిలో ఆయన రచనలు వుంటాయి. 2018లో లైంగిక ఆరోపణలు స్వీడిష్‌ అకాడమీని వెల్లువెత్తడంతో ఆ ఏడాది అవార్డును వాయిదా వేశారు. తర్వాత అకాడమీని పునర్వవ్యస్థీకరించారు. 2019లో ఆస్ట్రియాకు చెందిన పీటర్‌ హ్యాండ్కేకు సాహిత్య అవార్డును ఇచ్చినందుకుగాను మరిన్ని విమర్శలను ఎదుర్కొంది.