- లేబర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యంపై అధ్యయనానికి..
స్టాక్‌హౌం : ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికా ఆర్థిక వేత్త క్లాడియా గోల్డిన్‌కు దక్కింది. 2023 నోబెల్ బహుమతుల్లో చిట్టచివరిది అయిన ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. 'మహిళా లేబర్ మార్కెట్ ఫలితాలపై అధ్యయనం చేసినందుకు క్లాడియాకు ఈ బహుమతి లభించింది. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయిన క్లాడియా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మూడవ మహిళ. 1969లో ఈ అవార్డును ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు ముగ్గురే అందుకున్నారు. పాత కాలపు, చారిత్రక డేటానంతటినీ వెలికితీసి, ఒక పద్ధతి ప్రకారం పొందుపరిచి, సరిదిద్దడం ద్వారా క్లాడియా గొల్డిన్ సరికొత్త, విస్మయపరిచే వాస్తవాలను మనకు అందజేశారు. లేబర్ మార్కెట్‌లో మహిళలకు గల అవకాశాలను ప్రభావితం చేస్తున్న కారణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, మహిళల భాగస్వామ్యం ఎంత ఉపయుక్తమైనదో, దానికి ఎంత డిమాండ్ వుందో తెలుసుకోవడానికి కూడా ఆమె అధ్యయనం ఉపయోగపడింది.'' అని నోబెల్ కమిటీ పేర్కొంది.