Oct 03,2023 22:20

స్టాకహేోమ్‌ : అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల ప్రపంచాన్ని అన్వేషించేందుకు మానవాళికి కొత్త సాధనాలను అందజేసిన ప్రయోగాలను గుర్తిస్తూ భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం లభించింది. భౌతిక శాస్త్రవేత్తలైన పియర్రె అగొస్తిని, ఫెరెన్‌క్‌ క్రాయిస్జ్‌, అన్నె హుయిలర్‌లకు నోబెల్‌ బహుమతిని ప్రకటిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. కాంతి తరంగాల ఆటో సెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు వీరికి ఈ పురస్కారం దక్కింది. ఆటో సెకండ్‌ అనేది చాలా స్వల్పమైనది, ఒక సెకనులో ఈ ఆటో సెకండ్లు చాలా వుంటాయి, విశ్వం ఆవిర్భవించినప్పటి నుండి ఇలాంటి సెకండ్లు చాలా వుంటాయి. అణువుల్లో, పరమాణువుల్లో ఏం జరుగుతుందో దృశ్యాలను చిత్రీకరించేందుకు కాంతి తరంగాలకు సంబంధించిన ఈ స్వల్ప పల్స్‌లను ఉపయోగిస్తారు. అనేక దశాబ్దాల పాటు వీరి పరిశోధన సాగింది. ఒక పదార్ధంలో ఎలక్ట్రాన్లు ఎలా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ కొత్త సాంకేతికత చాలా కీలకమైనది.