న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని ఈ ఏడాది వైద్యశాస్త్ర విభాగంలో ఇద్దరికి ప్రకటించారు. ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పరిశోధనలు చేసిన కటాలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లకు ఈ పురస్కారం లభించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణల ప్రాతిపదికగా ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ల అభివృద్ధికి వీరు చేసిన ఆవిష్కరణలు దోహదపడ్డాయని, వీరి కృషి అద్వితీయమని నోబెల్ అకాడెమీ జ్యూరీ తెలిపింది.
1990వ దశకం ప్రారంభంలోనే బయో కెమిస్ట్ అయిన కటాలిన్ కరికో, ఎంఆర్‌ఎన్‌ఎ ప్రాధాన్యతను గుర్తించారు. ఆ తర్వాత ఆమె, ఆమె కొలీగ్, ఇమ్యూనాలజిస్ట్ అయిన డ్రూ వెయిస్‌మన్ పరిశోధనాంశాలతో 2005లో ఒక పత్రాన్ని ప్రచురించారు. న్యూక్లియోసైడ్ మాడిఫికేషన్ ప్రభావాన్ని, రోగ నిరోధక వ్యవస్థపై అది కనబరిచే ప్రభావాన్ని ఆ పత్రంలో రూపొందించారు. ఆ తర్వాత 2008, 2010ల్లో కూడా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. అవన్నీ కలిసి కోవిడ్ సమయంలో ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ల అభివృద్ధికి దోహదపడ్డాయి.
హంగరీకి చెందిన కరికో సాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2022 వరకూ బయాన్‌టెక్ ఆర్‌ఎన్‌ఎ ఫార్మస్యూటికల్స్‌లో సీనియర్ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇక అమెరికాకు చెందిన వెయిస్‌మన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెరల్‌మాన్ వైద్య పాఠశాలలో టీకాల పరిశోధనా విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతి కింద రూ.8.3 కోట్ల నగదు, జ్ఞాపికను ఈ నెల 10న వీరికి అందజేస్తారు. అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట వైద్యం, సాహిత్యం, ఆర్థికశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలతో బాటు ప్రపంచ శాంతికి కృషి చేసినవారికి కూడా ఈ పురస్కారాలను నోబెల్ అకాడెమీ అందజేస్తుంది.