Oct 19,2023 08:49

జెరూసలెం : తమ ప్రజలపై ఇజ్రాయిల్‌ ఉద్దేశ్యపూర్వకంగా సాగిస్తున్న ఊచకోతను ఆపాలని పాలస్తీనా ఉన్నతాధికారులు ప్రపంచ నేతలను కోరారు. గాజా ఆస్పత్రిపై దాడిని సున్నితంగా ఆలోచించేవారు, నైతిక విలువలు కలిగినవారెవరూ సహించరని అన్నారు. జరిగింది మారణకాండే అందులో ఎలాంటి సందేహం లేదని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌కు సీనియర్‌ సలహాదారుడు హుస్సేన్‌ అల్‌ షేక్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 'ఈ మారణకాండను నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం రంగంలోకి దిగాలని కోరుతున్నాం. మౌనం, పక్షపాతం ఇక ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు' అని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిపై దాడి జరిగిన తీరు భయానకంగా వుందని పాలస్తీనా ఆరోగ్య మంత్రి మాయి అల్‌ కైలా వ్యాఖ్యానించారు. 'దిగ్బంధనం విధించడం ద్వారా అన్ని మానవతా విలువలను, చట్టాలను ఇజ్రాయిల్‌ అతిక్రమించింది. ఆసుపత్రులను ధ్వంసం చేస్తున్నారు., శరణార్ధులు తలదాచుకుంటున్న శిబిరాలపైనా దాడులు చేస్తున్నారని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా జరిపే ఈ దాడుల నుండి తమను కాపాడాలంటూ ఐక్యరాజ్య సమితితో సహా అన్ని సంస్థలకు, ప్రపంచ దేశాలకు వారు విజ్ఞప్తి చేశారు.