Oct 19,2023 08:53

గాజా : గాజా ఆస్పత్రిపై బాంబు దాడిని ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్టు, జోర్డాన్‌, ట్యునీసియాతో సహా పలు దేశాలు ఖండించాయి. మంగళవారం నాటి దాడిలో వందలాదిమంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన వారితో, రోగులతో కిక్కిరిసి వున్న ఈ ఆస్పత్రిపై దాడి అత్యంత హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. గాజాలోని అల్‌ అహ్లి ఆస్పత్రిపై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇజ్రాయిల్‌ క్రూరత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆస్పత్రిలోని హాల్స్‌ అన్నింటికీ మంటలు వ్యాపించాయి. ఎక్కడికక్కడ పగిలిన గాజు ముక్కలు, చెల్లా చెదురుగా పడిన మృత దేహాలతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా వుంది. ఈ దాడిలో 500మంది మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ గాజా ప్రాంతాన్ని వీడాల్సిందిగా ప్రజలను ఇజ్రాయిల్‌ ఆదేశించిన నేపథ్యంలో గాజా నగరంలోని పలు ఆస్పత్రులు వందలాదిమంది శరణార్ధులతో నిండిపోయాయి.
అయితే ఆస్పత్రి మరణాలపై ఇంకా వివరాలు అందాల్సి వుందని ఇజ్రాయిల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి తెలిపారు. 'వివరాలు అందిన వెంటనే ప్రజలకు అన్ని విషయాలు తెలియచేస్తాం. ఇది ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడి అని చెప్పలేం.'' అని ఆయన అన్నారు. మరోవైపు దక్షిణ గాజాలో దాడులు కొనసాగుతునే వున్నాయి. అమాయక పౌరులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. మానవతా సాయం అందేందుకు కారిడార్లు తెరవాల్సిందిగా ఇజ్రాయిల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గత వారం రోజుల దాడుల్లో ఐక్యరాజ్య సమితికి చెందిన 24 లక్ష్యాలపై దాడులు జరిగాయి. 14మంది ఐరాస సిబ్బంది మరణించారు. ఇప్పటికి 10లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు తమ ఇళ్ళను వీడి వెళ్లిపోయారు. గాజాలో మిగిలిన సగానికిపైగా జనాభా కేవలం 14కిలోమీటర్ల ప్రాంతంలో వున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

  • యూరోపియన్‌ నేతలూ ..

గాజాలో ఆస్పతిపై దాడి యురోపియన్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. పలువురు పాలస్తీనియన్ల మృతికి కారణమైన గాజా ఆస్పత్రిపై దాడిని ఫ్రాన్స్‌ ఖండించింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆస్పత్రిపై దాడిని ఏ రకంగానూ సమర్ధించలేమన్నారు. గాజాలోకి మానవతా సాయం వెళ్లేందుకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇయు ఉన్నత దౌత్యవేత్త జోసెఫ్‌ బోరెల్‌ మాట్లాడుతూ, ఈ నేరానికి కారకులెవరో నిర్ధారించాలన్నారు. మరోసారి అమాయకులు అత్యున్నత మూల్యం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఫోటోలు చూసి దిగ్భ్రాంతి చెందానని జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జు వ్యాఖ్యానించారు. ఈ ఘటనకుర సంబంధించిన వాస్తవాలు వెలికి రావాలని, అది చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లేవర్లీ మాట్లాడుతూ, ఈ దాడికి ఇజ్రాయిల్‌ కారణమని తాము భావించడం లేదన్నారు. అయితే వాస్తవాలు నిర్ధారించబడే వరకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం అన్నింటికంటే ముఖ్యమన్నారు.