Nov 12,2023 11:24

 ఐదు వామపక్షాల డిమాండ్‌
న్యూఢిల్లీ :   
పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ మారణకాండను తక్షణమే ఆపాలని ఐదు వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎఐఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, సిపిఐ (ఎంఎల్‌)-లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య ఒక ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణ జరిపి, మారణకాండను ఆపితేనే పరిష్కార మార్గం దొరుకుతుందని వారు స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న ఊచకోతను సమర్ధించడాన్ని ఆపాలంటూ వామపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అమెరికా, భారత్‌ విదేశాంగ, రక్షణ మంత్రులు జరిపిన ముఖాముఖి చర్చల్లో గాజాకు మానవతా సాయం అందించడం కోసం కాల్పులకు విరామం ఇవ్వాలంటూ కోరారు. రెండు దేశాల ఏర్పాటే పరిష్కార మార్గమని భారత్‌ ఆ సమావేశాల్లో పునరుద్ఘాటించింది. అయితే, ఈ సమావేశాల్లో కాల్పుల విరమణకు పిలుపివ్వకుండా విరామం కోసం పిలుపివ్వడమంటే ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ మారణకాండను చట్టబద్ధం చేయడమే అవుతుందని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. 35 రోజులుగా ఏకధాటిగా ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే 11వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో దాదాపు సగం మంది చిన్నారులే, అసుపత్రులపైన అత్యంత ఆటవికమైన, క్రూరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. తక్షణమే కాల్పుల విరమణ జరపాలని వామపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు.