Oct 28,2023 07:56

లండన్‌ :   బ్రిటన్‌లోని మూడు ఆయుధ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని శుక్రవారం పాలస్తీనా హక్కుల కార్యకర్తలు అడ్డుకున్నారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్‌ చేపడుతున్న నరమేధాన్ని నిలువరించడం లక్ష్యంగా ఆయుధ ఫ్యాక్టరీల ఎదుట ఆందోళన చేపట్టారు. కెంట్‌, శాండ్‌విచ్‌లోని ఇన్‌స్ట్రో ప్రెసిషన్‌, హౌమెట్‌ ఫాస్టెనింగ్‌ సిస్టమ్స్‌, యుఎవి టాటికల్‌ సిస్టమ్స్‌ ఫ్యాక్టరీలను అడ్డుకున్నారు. ఈ మూడు ఫ్యాక్టరీల్లోనూ నేడు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. వీటిల్లో ఓ ఫ్యాక్టరీ ఎఫ్‌-35 బాంబులను ఇజ్రాయిల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది.
ట్రేడ్‌ యూనియన్స్‌తో పాటు సుమారు 100 మంది ఈ ప్రదర్శనలో పాల్గన్నారు. ''స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం కార్మికులు (వర్కర్స్‌ ఫర్‌ ఫ్రీ పాలస్తీనా), బ్రిటన్‌ ఇజ్రాయిల్‌కు ఆయుధాలను అందించడం ఆపాలి (యుకె స్టాప్‌ ఆర్మింగ్‌ ఇజ్రాయిల్‌)'' ప్లకార్డులను ప్రదర్శించారు. వర్కర్స్‌ ఫర్‌ ఫ్రీ పాలస్తీనా ప్రదర్శనలో యునైట్‌, యునిసన్‌, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ యూనియన్‌; యూనివర్శిటీ అండ్‌ కాలేజీ యూనియన్‌, బ్రిటీష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మరియు బేకర్స్‌ యూనియన్‌ సభ్యులు ఈ ప్రదర్శనలో పాల్గోన్నారు.