Sep 23,2023 14:45

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : 9/77 అసైన్ భూముల చట్టానికి సవరణలు చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములను ఇతరులకు యాజమాన్య హక్కులను కట్టబెట్టడం వలన దళితులకు తీరని ద్రోహం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.క్రాంతి బాబు విమర్శించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలో  జరిగిన దళిత రక్షణ యాత్ర లో భాగంగా సిద్ధాంతం , పెనుగొండ గ్రామంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన దళిత రక్షణ యాత్రను ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ దళితుల చేతిలో ఉన్న కాస్త భూమిని లాగేసుకోవటమే అవుతుందని అసైన్డ్ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం, దళితుల స్మశాన వాటిక భూములు కేటాయింపు, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల అమలు , ఉపాధి హామీ పథకం చట్టం అమలుకు నిధులు కేటాయింపు, దళిత హక్కులు-సామాజిక న్యాయం అమలు లక్ష్యంగా జరుగుతున్న ఈ దళిత రక్షణ యాత్రను ఈనెల 29వ తేదీన విజయవాడలో మహాధర్నా వరకు కొనసాగుతుందన్నారు.  ఈ సందర్భంగా దళిత కాలనీలో  దళితుల సమస్యలపై సేకరించిన వినతి పత్రాలని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, షేక్ పాదుషా, కెవిపిఎస్ నాయకులు బాతిరెడ్డి జార్జ్, కప్పల రత్నరాజు, బి విజయ్, సూర్నీడి వెంకటేశ్వరరావు ప్రజానాట్యమండలి మండలి కళాకారులు,  షేక్ వల్లి, కొండేటి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు