Nov 12,2023 11:58

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) :  విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వించదగ్గ విషయమని నిట్‌ రిజిస్ట్రార్‌ పి.దినేష్‌ శంకర్‌రెడ్డి తెలిపారు. నిట్‌ కళాశాలలో ఇసిఇ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి టి.మంజునాథ్‌ పవర్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ పోటీల్లో కాంస్య పతాకాలను సాధించాడు. కలకత్తాలోని ఎన్‌ఐటి దుర్గాపూర్‌లో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకూ నిర్వహించిన ఆల్‌ ఇండియా ఇంటర్‌ ఎన్‌ఐటి పోటీలకు దేశంలోని 28 ఎన్‌ఐటిల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో తాడేపల్లిగూడెం నిట్‌ విద్యార్థి మంజునాథ్‌ 100వ విభాగంలో పవర్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ కనబర్చి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. ఇతనికి జిమ్‌ ట్రెయినీగా ఎం.సూర్యప్రకాష్‌ వ్యహహరించాడు. నిట్‌ రిజిస్ట్రార్‌ పి.దినేష్‌శంకర్‌రెడ్డి, మంజునాథ్‌ను, అలాగే వివిధ పోటీల్లో నాలుగు, ఐదు స్థానాలు సాధించిన క్రీడాకారులను శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి నిట్‌ ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమన్నారు. మంజునాథ్‌ స్ఫూర్తితో మిగిలిన క్రీడాకారులు కూడా వివిధ పోటీల్లో రాణించి సంస్థకు పేరు తేవాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ జిబి.వీరేష్‌కుమార్‌, సాస్‌ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ కిరణ్‌ తీపర్తి, ఆచార్యులు డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ జి.కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ యువరాజు పాల్గొన్నారు.