ప్రజాశక్తి-పాలకొల్లు : అర్ధరాత్రి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం తెల్లవారుజామున నెలల నిండిన గర్భిణీకి వైద్యులు లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కన్నీరుతో ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా రాత్రి వెంటనే స్పందించి ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు అందేలా బాధ్యత తీసుకున్నారు. బయట నుంచి గైనకాలజిస్ట్, మత్తు వైద్యులను రప్పించి గర్భిణీ ప్రసవించేలా బాధ్యత తీసుకున్నారు. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ కుటుంబం ఆనంద భాష్పాలు వ్యక్తపరిచింది. క్షేమంగా ఉన్న తల్లి బిడ్డలను చూసి మీ ఇంటికి మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి జన్మంతా రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుప్రక్కల 15 లక్షల మంది ప్రజలకు సేవలు అందిస్తోందని చంద్రబాబు హయాంలో రూ.12.5 కోట్లు మంజూరు చేసి ఏడాదిలో పూర్తి చేయాలని భావించామని అయితే గత నాలుగున్నర ఏళ్లుగా నిర్మాణం నత్తనడకన సాగుతోందని దీంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు.