- వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రల్లో వక్తలు
- పోరాటం ప్రారంభించి నేటికీ 900 రోజులు
ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని నాయకులు, కార్మికులు తేల్చి చెప్పారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు పోరాటం మొదలుపెట్టి సోమవారం నాటికి 900 రోజులవుతున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన గంగవరం, పెదగంట్యాడ, వడ్లపూడి, కూర్మన్నపాలెం, అగనంపూడి, ఉక్కునగరం ప్రాంతాల్లో ఆదివారం పాదయాత్రలు జరిగాయి. ఉక్కు కార్మిక చైతన్య భేరి పేరిట జరిగిన ఈ పాదయాత్రల్లో పెద్ద సంఖ్యలో ఉక్కు కార్మికులు, నిర్వాసితులు పాల్గన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసిత కాలనీల్లో పెద్ద పెట్టున నినదించారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కన్వీనర్ కెఎస్‌ఎన్.రావు, కో-కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడారు. సుదీర్ఘకాలంగా పోరాటం కొనసాగుతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోన్న ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడం తగదన్నారు. ప్లాంట్‌ను అమ్మేస్తామని పదేపదే బిజెపి మంత్రులు చెప్పడం శోచనీయమన్నారు. ప్రజల సంపదైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పాదయాత్రల్లో పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, జె.రామకృష్ణ, ఎ.మసేనురావు, యు.రామస్వామి, వైటి.దాస్, వై.మస్తానప్ప, చిత్రాడ సన్యాసిరావు, శ్రీనివాసనాయుడు, జెర్రిపోతుల ముత్యాలు, దొమ్మేటి అప్పారావు, పిట్టా రెడ్డి పాల్గొన్నారు.
- దాచుకున్న డబ్బులు.. ఉక్కు పోరుకు..
ఉక్కు పరిరక్షణ పోరాటానికి ఓ విద్యార్థిని తాను దాచుకున్న డబ్బులు అందజేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితుల సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు మంత్రి సత్యారావు మనవరాలు, నాయకులు మంత్రి గోపి నారాయణ కుమార్తె చార్మిల తాను రూపాయి, రూపాయి చొప్పున కూడబెట్టుకున్న డబ్బులను ఆదివారం పోరాట కమిటీ నేతలకు అందజేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని నేతలను కోరింది.
- నేడు కూర్మన్నపాలెం నుంచి అదానీ గంగవరం పోర్టు వరకూ పాదయాత్ర
స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపడుతున్న పోరాటం ఎంతో చారిత్రాత్మకమైనది. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణలో భాగంగా అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించిన కొద్దిక్షణాల్లోనే ఉక్కు కార్మికులు భగ్గుమన్నారు. ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం కూడలిలో దీక్షలు మొదలుపెట్టి నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాదయాత్రలు, మానవహారాలు, సదస్సులు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు పెట్టి యావత్తు దేశాన్నీ కదిలించారు. వారికి బిజెపి మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రజలంతా ఉక్కు కార్మికుల వెంట నడిచారు. ఆ ఫలితంగానే నేటికీ ఉక్కు కర్మాగారంలోకి ఏ ఒక్క పెట్టుబడిదారుడూ అడుగుపెట్టలేకపోయాడు. అయినప్పటికీ ప్రయివేటీకరణ ముప్పు పొంచి ఉండడంతో కార్మికులు పోరాటాన్ని వీడలేదు. సోమవారానికి ఈ దీక్షలు 900 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం కూర్మన్నపాలెం నుంచి అదానీ గంగవరం పోర్టు వరకూ పాదయాత్ర చేపట్టి అక్కడ నిరసన తెలపనున్నారు. ఉక్కు ఉత్పత్తికి ఇటీవల అదానీ పోర్టు ఆటంకాలు కల్పిస్తున్న నేపథ్యంలో పోరాట కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.










