Oct 31,2023 08:39

నేతలను అలెర్ట్‌ చేసిన యాపిల్‌ సంస్థ
ఈ వ్యవహారంపై మండిపడ్డ ప్రతిపక్షాలు
ప్రధానికి ఏచూరి లేఖ
నా ఫోన్‌ కూడా తీసుకోండి: రాహుల్‌ గాంధీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రతిపక్ష నేతలపై మోడీ సర్కార్‌ నిఘా పెట్టి మరోసారి అడ్డంగా దొరికిపోయింది. కేంద్ర ప్రభుత్వం నీతిమాలిన చర్యకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష నేతలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ మొబైల్‌ సంస్థ నుంచి అలర్ట్‌ మేసేజ్‌ లు రావడంతో ఈ నిఘా వ్యవహారం బయటపడింది. ''ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హ్యాకర్లు మీ ఐ ఫోన్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారంతోపాటు, కమ్యూనికేషన్స్‌, కెమెరా, మైక్రోఫోన్‌లను వారు హ్యాక్‌ చేసే అవకాశం ఉంది'' అనేది ఆ మెసేజ్‌ సారాంశం. మెసేజ్‌లు వచ్చిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఎంపీలు కె.సి. వేణుగోపాల్‌, శశిథరూర్‌, కాంగ్రెస్‌ నేత, ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం టి.ఎస్‌. సింగ్‌డియో, కాంగ్రెస్‌ ఎంపి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ మంత్రి కె.టి. రామారావు, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, .తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా, కాంగ్రెస్‌ నేత చెందిన పవన్‌ ఖేరా, సుప్రియా శ్రీనాటే (కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి), ది వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌, డక్కన్‌ క్రానికల్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌ శ్రీరామ్‌ కర్రి, జర్నలిస్టు రవి నాయర్‌, ఆనంద్‌ మంగ్నాలే (ప్రాంతీయ సంపాదకుడు, ఓసీసీఆర్పీ), సమీర్‌ సరన్‌ (ప్రెసిడెంట్‌, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌), రేవతి (స్వతంత్ర జర్నలిస్టు), కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయంలో పనిచేసే అనేక మంది ఉన్నారు. వారు తమ ఐ ఫోన్‌లకు వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీసి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. హౌంమంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాలను ట్యాగ్‌ చేశారు.
ప్రభుత్వమే ముద్దాయి: సీతారాం ఏచూరి
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. తన ఫోన్‌పై ప్రభుత్వ స్పాన్సర్డ్‌ నిఘా గురించి ఆపిల్‌ పంపిన అలెర్ట్‌ మెసేజ్‌ను ఆ లేఖలో ఆయన ఉటంకించారు. '' ఆపిల్‌ ఐడీతో అనుసంధానించబడిన మీ ఐఫోన్‌ని ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని యాపిల్‌ దృఢంగా విశ్వసిస్తోంది'' అని సోమవారం రాత్రి అందిన అలర్ట్‌ మెసేజ్‌లో ఉంది.. . ''ఇది భారత రాజ్యాంగం పౌరులందరికీ హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించడమే. ఈ నిఘా ప్రజాస్వామ్యానికి విరుద్ధం'' అని పేర్కొన్నారు. ''నా కార్యకలాపాలు తెరిచిన పుస్తకం లాంటివి, దాచడానికి ఏమీ లేదు. అయినా, నేను ఉపయోగించే ఫోన్‌ను దొంగచాటుగా యాక్సెస్‌ చేసి, నా పరికరాలలో కొంత సమాచారాన్ని చొప్పించి, కుట్టకథలను ప్రచారంలో పెట్టి వాటి ఆధారంగా నన్ను దోషిగా చిత్రించాలనేది వారి ఉద్దేశం కాబోలు.. మీ సారథ్యంలోని ఈ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను స్థూలంగా దుర్వినియోగం చేస్తున్నందున, అలాంటి అవకాశం ఉంది'' అని తెలిపారు. ''ప్రధానమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత రాజ్యాంగాన్ని పరి రక్షిస్తామని హామీ ఇచ్చారు. దానికి బదులుగా, ప్రజాస్వామ్యం, పౌరుల ప్రజాతంత్ర హక్కులు మొత్తంగా ధ్వంసం చేయబడుతున్నాయి.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని ఆ లేఖలో ఏచూరి పేర్కొన్నారు.
నా ఫోన్‌ కూడా తీసుకోండి, భయపడేది లేదు: రాహుల్‌ గాంధీ
ప్రతిపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భగ్గుమనడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ''ఎన్ని ఫోన్లు ట్యాపింగ్‌ చేయాలనుకుంటే అన్ని ఫోన్లు ట్యాప్‌ చేయండి. నా ఫోన్‌ కూడా తీసుకోండి, భయపడేది లేదు'' అని అన్నారు. దేశంలోని పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని, వారికి యాపిల్‌ సంస్థ నుంచి అలర్డ్‌ మెసేజ్‌లు కూడా వచ్చాయని అన్నారు. మంగళవారం నాడిక్కడ ఎఐసిసి ప్రధాన కార్యాలయంతో రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ''మీరు ఎన్ని ఫోన్లు హ్యాకింగ్‌ చేయాలని అనుకుంటారో అన్నీ చేయండి. నా ఫోన్‌ కూడా తీసుకోండి. నేను భయపడను. ఇది నేరగాళ్లు, దొంగలు చేసే పని. మా కార్యాలయానికి చెందిన అనేక మందికి ఈ మెసేజ్‌లు వచ్చాయి. కేసీ వేణుగోపాల్‌, సుప్రియ, పవన్‌ ఖేరకు కూడా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లు (బిజెపి) దేశంలోని యువత దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని రాహుల్‌ అన్నారు. అదానీ అంశాన్ని రాహుల్‌ ప్రస్తావిస్తూ, గతంలో ప్రధాని మోడీని నెంబర్‌ 1గా, అదానీని నెంబర్‌ 2గా, అమిత్‌ షాను నెంబర్‌ 3గా తాను చెప్పేవాడినని, అయితే అది సరికాదని అన్నారు. అదానీ నెంబర్‌ 1, మోడీ నెంబర్‌ 2, అమిత్‌ షా నెంబర్‌ 3 అని పేర్కొన్నారు. అదానీ తప్పించుకోలేరని, డిస్ట్రాక్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని ఆయన అన్నారు. ఇది 'అదానీ సర్కార్‌' అంటూ రాహుల్‌ అభివర్ణించారు. ''ఇది ఆసక్తికరమైన సమస్య. నాదగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. టైము వచ్చినప్పుడు అదానీ ప్రభుత్వాన్ని తొలగించి చూపిస్తాం. దేశంలో అదానీ మోనపలైజేషన్‌ నడుస్తోంది. బీజేపీ ఆర్థిక వ్యవస్థ ఆయనతో (అదానీ) నేరుగా ముడిపడి ఉంది'' అని రాహుల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ, ఇండియా ఫోరమ్‌ నేతల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కూడా తనకు యాపిల్‌ నుంచి అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.. ఇతర ఎంపీల మాదిరిగానే థరూర్‌ కూడా హౌం మంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాలను ట్యాగ్‌ చేశారు. ఆరోపించిన హ్యాకింగ్‌ బిడ్‌పై విచారణకు పిలుపునిచ్చారు. మరో కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశారు. ''డియర్‌ మోడీ సర్కార్‌. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?'' అని రాసుకొచ్చారు. ఈ హ్యాకింగ్‌ దేశ ప్రజలపై దాడి అని ఆప్‌ రాజ్యసభ ఎంపీ చద్దా సుదీర్ఘమైన నోటును పోస్ట్‌ చేశారు. ''ప్రతి భారతీయుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను, రేపు అది మీరు కావచ్చు'' అని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుల ఆరోపణలపె బిజెపి ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తూ, పలువురు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. యాపిల్‌ నుంచి స్పష్టత వచ్చేవరకు వారు ఎందుకు వేచి చూడలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.