Aug 05,2023 12:12

న్యూఢిల్లీ : నోర్మూసుకుని గమ్మున ఉండండి.. లేదంటే మీ ఇంటికి ఇడి వస్తుందని పార్లమెంట్‌ సాక్షిగా ప్రతిపక్ష ఎంపీిలపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం లోక్‌సభలో ఢిల్లీ సేవల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సమయంలో కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీనిపై మంత్రి మీనాక్షి లేఖి జర్రున లేచి, 'మీరు గమ్మున ఉండండి. లేదంటే మీ ఇంటికి ఇడి వస్తుంది' అని బెదిరింపు ధోరణిలో అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నూటికి నూరుపాళ్లు నిజమని మంత్రి వ్యాఖ్యలు రుజువు చేశాయని ఎన్‌సిపిఅధికార ప్రతినిధి క్లాడీ కాస్ట్రో తెలిపారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ విమర్శించారు.