న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం నుండి టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపిలు వాకౌట్ చేశారు. విచారణ జరిగిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ మహువా మొయిత్రాను ''వ్యక్తిగత మరియు అనైతిక ప్రశ్నలు'' అడిగారని ప్రతిపక్ష ఎంపిలు పేర్కొన్నారు. ఓ వైపు సమావేశం జరుగుతుండగా ఓ ఎంపి వివరాలను మీడియాకు లీక్ చేశారని మండిపడ్డారు.
''ఇదేం సమావేశం .. వారు నీచమైన ప్రశ్నలను అడుగుతున్నారు'' అని ప్రతిపక్ష ఎంపిలతో బయటకు వస్తున్న సమయంలో మొయిత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ''వారు దేని గురించి అయినా ప్రశ్నిస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు'' అని అన్నారు. మీ కళ్లలో నీళ్లు చూస్తామని అన్నారని, తన కళ్లలో నీళ్లు ఉన్నాయా .. మీకు కనిపిస్తున్నాయా అంటూ మీడియాను ప్రశ్నించారు. నగదు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమె గురువారం పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.