ఎథిక్స్ కమిటికి సిఫారసు
6-4 మెజార్టీతో ఆమోదముద్ర
పక్షపాత ప్రతిపాదనగా పేర్కొన్న ప్రతిపక్షాల సభ్యులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీపై వేటు పడనుంది. 'ప్రశ్నకు నోటు' వ్యవహారంపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ.. ఆమెను పార్లమెంటు నుంచి బహిష్కరించాలన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన 500 పేజీల నివేదికకు 6:4 మెజార్టీతో కమిటీ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ప్రతిపాదనలు పక్షపాత ధోరణిలో చేసిన తప్పుడు ప్రతిపాదనలని ఎథిక్స్ కమిటీలోని ప్రతిపక్షాల సభ్యులు తప్పుబట్టారు. గురువారం నాడిక్కడ పార్లమెంట్ అనెక్స్ భవనంలో లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. మహువాను బహిష్కరించాలన్న సిఫార్సుకు అనుకూలంగా ఆరుగురు సభ్యులు ఓటు వేయగా.. నలుగురు వ్యతిరేకించారు. కమిటీలో 15 మంది సభ్యులు ఉండగా, గురువారం సమావేశానికి 10 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరైన వారిలో కమిటీ చైర్మన్, బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోంకర్, అదే పార్టీకి చెందిన ఎంపీలు అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రారు, సుమేధనంద్ సరస్వతి, హేమంత్ గాడ్సే (శివసేన-షిండే), కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ (ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు) మొయిత్రాను బహిష్కరించే ప్రతిపాదనను ఆమోదిస్తూ ఓటు వేయగా..ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ ఎంపి వి. వైతిలింగం, సిపిఎం ఎంపి పిఆర్ నటరాజన్, జెడియు ఎంపి గిరిధారి యాదవ్, బిఎస్పీ ఎంపి కున్వర్ డానిష్ అలీ వ్యతిరేకించారు.
బిజెపి ఎంపిలు విష్ణు దత్ శర్మ, సునీతా దుగ్గల్, సుభాష్ భామ్రే, వైసిపి ఎంపి వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ ఎంపి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనుండంతో తాను హాజరుకాలేనని, సమావేశం తేదీని రీ షెడ్యూల్ చేయాలని చైర్మన్ వినోద్ కుమార్‌కు కాంగ్రెస్ ఎంపి ఎన్ ఉత్తమ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
మహువా మోయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని, ఆమె నేరానికి పాల్పడిందని ఎథిక్స్ ప్యానెల్ తెలిపింది. మహువా మోయిత్రాను ఎంపీగా కొనసాగించడానికి అనుమతించకూడదని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ కమిటీ ఆ నివేదికలో సిఫార్సు చేసింది. అంతేకాదు.. మోయిత్రా చర్య (పార్లమెంటరీ లాగిన్ వివరాల్ని వ్యాపారవేత్త దర్శన్ హిరానందానితో పంచుకోవడం)ను నేరపూరితంగా కమిటీ అభివర్ణించింది. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చట్టపరమైన, సమగ్రమైన, సంస్థాగత దర్యాప్తుని చేపట్టాలని కూడా కమిటీ సూచించింది. తన పార్లమెంటరీ లాగిన్ వివరాల్ని అనధికార వ్యక్తులతో మోయిత్రా పంచుకున్నారని, ఆమె పార్లమెంట్ ప్రత్యేక హక్కును ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ కమిటీ సిఫార్సును నేడు (శుక్రవారం) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎథిక్స్ కమిటీ నివేదికలోని అంశాలు ఆమోదానికి ముందే మీడియాలో రావడంపై మహువా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి
మహువాపై చర్యలను తప్పుపడుతూ, చైర్మన్ అడిగిన అనైతిక ప్రశ్నలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు అసమ్మతి నోట్లు సమర్పించారు. కాంగ్రెస్ ఎంపి వి. వైతిలింగం, సిపిఎం ఎంపి పి.ఆర్ నటరాజన్, జెడియు ఎంపి గిరిధారి యాదవ్, బిఎస్పీ ఎంపి కున్వర్ డానిష్ వేర్వేరుగా అసమ్మతి నోట్లు అందజేయగా, కాంగ్రెస్ ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్‌లైన్‌లో సమర్పించారు.
ఇదే తొలిసారి
ఒక ఎంపీని బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం బహుశా ఇదే తొలిసారి అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారి తెలిపారు. 2005లో 'ప్రశ్నకు నోటు' కేసులో 11 మంది ఎంపిలను పార్లమెంట్ నుండి బహిష్కరించారు. అయితే ఆ బహిష్కరణలను రాజ్యసభ ఎథిక్స్ కమిటీ, లోక్‌సభ విచారణ కమిటీ సిఫార్సు చేశాయన్నారు.