ప్రతిపక్ష ఎంపీల వాకౌట్
నీచమైన ప్రశ్నలంటూ మొయిత్రా ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 'క్యాష్ ఫర్ క్వైరీ' (ప్రశ్నకు డబ్బు) వ్యవహారంలో టిఎంసి ఎంపి మహువా మొయిత్రా గురువారం పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. ఆమె వ్యక్తిగత అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగడంతో విచారణ జరుగుతుండగానే.. మహువా మొయిత్రాతోపాటు కమిటీలో ఉన్న ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ గౌరవం లేని, అనైతికమైన, గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు అడిగారని వారు విమర్శించారు. లోక్‌సభలో టిఎంసి ఎంపి మొయిత్రా లంచం తీసుకుని అదానీ గ్రూప్‌పై ప్రశ్నించారని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ఫిర్యాదును పరిశీలించేందుకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
15 మంది సభ్యుల కమిటీలో గురువారం సమావేశానికి 11 మంది హాజరయ్యారు. బిఎస్‌సి ఎంపి డానిష్ అలీ, సిపిఎం ఎంపి పిఆర్ నటరాజన్ సహా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత కూడా సమావేశం కొనసాగింది. దర్శన్‌తో ఉన్న సంబంధాలపై కమిటీ మహువాను ప్రధానంగా అడిగినట్లు సమాచారం. దర్శన్, ఆయన మాజీ స్నేహితుడు న్యాయవాది దేహద్రారుతో తనకున్న సంబంధాన్ని మహువా వివరించారు. అఫిడవిట్‌లోని కొన్ని విషయాలను ఛైర్మన్ అడగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు మహువాకు మద్దతు పలికారు.
మొయిత్రా వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనైతిక ప్రశ్నలను కమిటీ వేసిందని, దాంతో పెద్ద దుమారం చెలరేగిందని బిఎస్‌పి ఎంపీ డానిష్ అలీ పేర్కొన్నారు. 'ఛైర్మన్ అడిగిన ప్రశ్నలు అమర్యాదగా ఉన్నాయి. కమిటీ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఎవరు ఎవరితో మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? మీరు రాత్రి ఎవరితో మాట్లాడతారు? మీరు ఎలా మాట్లాడతారు? వంటి అనైతిక ప్రశ్నలను ఒక మహిళను అడిగారని, ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా?' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతుండగానే ఆ వివరాలన్నీ బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చైర్మన్ ఎవరికోసమో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళను వ్యక్తిగత విషయాలపై అడిగే హక్కు కమిటీకి లేదని జెడియు ఎంపి గిరిధారి యాదవ్ వ్యాఖ్యానించారు. బిజెపి ముందే తయారు చేసుకున్న స్క్రిప్ట్‌ను బట్టి ఛైర్మన్ ప్రశ్నలు అడిగారని విమర్శించారు.
ఇదేం మీటింగ్ : మొయిత్రా
''అసలు ఇదేం మీటింగ్? కమిటీ సభ్యులు నీచమైన ప్రశ్నలు అడుగు తున్నారు. వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు వేస్తున్నారు. విచారణ సమయంలో నా కళ్లల్లో నీళ్లు వచ్చాయని అన్నారు. నా కళ్లలో నీళ్లు మీకు కనిపిస్తున్నాయా'' అంటూ మీడియాతో మాట్లాడుతూ మొయిత్రా అన్నారు. తన వ్యక్తిగత విషయాల్ని మీటింగ్‌లో చర్చించాల్సిన అవసరం లేదని ఆమె పదేపదే పునరుద్ఘాటించారని తెలిసింది. తన స్నేహితుడి వద్ద నుంచి బహుమతి లభిస్తే, ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీ ముందుకు ఎలా తీసుకొస్తారని మోయిత్రా ప్రశ్నించారు.
మొయిత్రా సహకరించలేదు : కమిటీ ఛైర్మన్ సోంకార్
క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సమయంలో మహువా మొయిత్రా ఏమాత్రం సహకరించలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్, బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోంకార్ తెలిపారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆమె తమ మీద కోపం ప్రదర్శించారని, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించారని ఆరోపించారు. మొయిత్రాతోపాటు ప్రతిపక్ష ఎంపీలు తమపై నిందలు మోపుతూ సమావేశం నుంచి వాకౌట్ చేశారని చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలు కమిటీ ముందు ఉన్నాయని, మహువాను ఏ శక్తీ కాపాడలేదని బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు.