తిరువనంతపురం : కేరళ పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా ఉన్నాయంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపిసి సెక్షన్ 153, సెక్షన్ 153 ఎ కింద కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు తెలిపారు. కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు మృతి చెందగా, కనీసం 50 మంది గాయాలపాలయ్యారు.
ఈ పేలుళ్లపై రాజీవ్ చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేరళలో జిహాద్ కోసం ఉగ్రవాద హమాస్ బహిరంగ పిలుపులు అమాయక క్రైస్తవులపై దాడులు, పేలుళ్లకు కారణమవుతున్నాయని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఉగ్రవాదులకు రెడ్ కార్పెట్ పరిచిందని, ఉగ్రవాద సంస్థ హమాస్ మాజీ చీఫ్‌ను రాష్ట్ర యువతను ఉద్దేశించి ప్రసంగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్ల అనంతరం పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర మంతా ఒక్కతాటిపై వచ్చిన సమయంలో కేంద్రమంత్రి విషాన్ని చిమ్మేలా పోస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. సమాజంలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ధ్వజమెత్తారు.