Nov 03,2023 10:59

కొచ్చి : కలమసేరి పేలుళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై కేరళ పోలీసులు రెండో కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో మతపరమైన రెచ్చగొట్టే పోస్టులు చేశారనే అభియోగాలతో ఎర్నాకులం సెంట్రల్‌ పోలీసులు కేంద్ర మంత్రిపై గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో బిజెపి జాతీయ కార్యదర్శి అనిల్‌ కె ఆంటోని పేరును కూడా చేర్చారు. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కెపిసిసి) డిజిటల్‌ మీడియా సెల్‌ కన్వీనర్‌ సరిన్‌ పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కేరళలో మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ సోషల్‌ మీడియా పోస్టులు చేశారని సరిన్‌ పి ఫిర్యాదులో ఆరోపించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి అయిన రాజీవ్‌ చంద్రశేఖర్‌పై మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. కలమసేరి పేలుళ్లపైనే అక్టోబర్‌ 31న మొదటి కేసును ఎర్నాకులం సెంట్రల్‌ పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.