Sep 26,2023 15:36

ప్రజాశక్తి-పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : విద్యుత్‌ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన భారాలను మోపుతూ దోపిడీకి పాల్పడుతోందని సిపియం జిల్లా కార్యదర్శి బి బలరాం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్టేరు దేవాంగ కళ్యాణ మండపంలో ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు సిపిఎం నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యస్‌.వి.యన్‌ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సంధర్భంగా బలరామ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఆప్‌, సెస్‌, సర్ధుబాటు ఛార్జీల పేర్లతో పెద్దఎత్తున విద్యుత్‌ భారాలను ప్రజలపై మోపుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ 400 కోట్లకు పైగా విద్యుత్‌ ఛార్జీలు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఒకేసారి ప్రజలకు భారం కాకుండా కొన్ని నెలలు విరామం ఇచ్చి సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు మోపి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల పేరుతో మీటర్ల వ్యవస్థనే మార్చి అదానీ కంపెనీలకు ఉపయోగపడేలా గహాలకు, వ్యవసాయానికి కూడా మీటర్లు బిగిస్తూ వేల కోట్లు రూపాయలు కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తామని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చెబుతూనే వ్యవసాయ బోర్లకు మీటర్‌లు బిగించి రాబోయే రోజుల్లో భారాలు మోయడానికి కుట్ర చేస్తోందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని అన్నారు.తక్షణం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తున్నవారిని జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపియం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామనీ బలరాం తెలిపారు. వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు, తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చి అమలులో ఘోరంగా విఫలమైందని అన్నారు. ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని తెలిపారు.అంగన్‌ వాడీల కుటుంబ సభ్యులను కూడా కొన్ని జిల్లాలలో పోలీసు స్టేషన్‌లలోకి తీసుకెళ్ళి నిర్భంధించారని తెలిపారు.అంగన్‌ వాడీల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో అక్రమంగా అరెస్టుచేయడం హేయమని విమర్శించారు. సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ పంట మరికొద్ది రోజుల్లో కోతకు రాబోతున్నదని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు దగ్గరగా అందుబాటులో ఉన్న మిల్లులకే ధాన్యం అమ్మాలని, ధాన్యం అమ్మిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని, కౌలు, చిన్న ,సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు మండలాల కార్యదర్శులు కూసంపూడి సుబ్బరాజు, సూర్నీడి వెంకటేశ్వర్రావు, పిల్లి ప్రసాద్‌, నాయకులు వద్దిపర్తి అంజిబాబు, పి మోహనరావు, కేతా పద్మజ, నేదూరి హనుమంతరావు,రాపాక ఆశీర్వాదం, షేక్‌ పాదుషా,బొంతు శ్రీను, నీలాపు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.