- నినాదంతో నో టొబాకో డే : డాక్టర్ ఆదిత్య కౌర
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : స్టార్ట్ ప్లాంటింగ్.. స్టాప్ స్మోకింగ్ అనే నినాదంతో వరల్డ్ నో టొబాకో డేను జరుపుకుంటున్నట్లు హెచ్‌సీజీ కేన్సర్ ఆసుపత్రి సిఇఓ డాక్టర్ ఆదిత్య కౌర తెలిపారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖలోని అర్కే బీచ్ కాళీ మాత గుడి వద్ద నిర్వహించిన జుంబా ఫిట్ నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్లకు ప్రధాన కారణమవుతున్న పొగాకును పగాకుగా భావించి దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం వుందన్నారు. దీని గురించి ప్రజల్ని చైతన్య పరిచి, పొగాకు వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా జుంబా ఫిట్‌నెస్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీష్ మాట్లాడుతూ జీవన పరిణామంలో సమాజానికి మేలు చేకూర్చేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెచ్‌సీజీ సేవల్ని కొనియాడారు. శారీరక దృఢత్వానికి జుంబా ఉపయోగ పడుతుందన్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకానికి స్వస్తి పలకితేనే క్యాన్సర్ మహమ్మారి అదుపులోకి వస్తుందన్నారు. ఆస్పత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కోట్నే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. అందరి భాగస్వామ్యంతో తాము వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు. తమ హెచ్‌సీజీ కేన్సర్ సెంటర్ సేవల్ని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు అందరికీ వివరించారు. 88పడకలతో ట్రూబీమ్ ఇన్సలేషన్ ప్రక్రియ కలిగిన ఏపీలో ఒకేఒక్క ఆస్పత్రి తమదేనన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి వుండి అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉన్న సంస్థ కూడా తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ లేబర్ కమిషనర్ ఎం.రామారావు, పిఎఫ్ రీజనల్ కమిషనర్ విజయ భాస్కర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు










