
శ్రీలంకలో ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగిసిపడటంతో ఇంతవరకు అధికారం చూరు పట్టుకు వేలాడిన గొటాబయ రాజపక్సె అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. ప్రజాగ్రహం పెల్లుబికితే ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడైనా మట్టి కరవక తప్పదనే చారిత్రిక సత్యాన్ని లంక ప్రజలు శనివారం నాటి తిరుగుబాటు ద్వారా మరోసారి నిరూపించారు. ఒక్క ఆయుధం కూడా పట్టుకోకుండా, ఏ పిలుపూ లేకుండా జాతీయ పతాకాన్ని చేబూని కొలంబోకు ప్రజలు దండుగా కదిలిన తీరు 'అరబ్ వసంతం' (అరబ్ దేశాల్లో ప్రజా తిరుగుబాట్లు) నాటి దృశ్యాల్ని గుర్తు చేశాయి. ప్రజా ఉద్యమ ధాటికి బారికేడ్లు, బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులేవీ అడ్డు నిలవలేకపోయాయి. 'దేశమంతా కొలంబోకే', 'గొటాబయ గో హోమ్' అన్న నినాదాలు ఆటంబాంబు కన్నా శక్తివంతంగా పేలాయి. గత నాలుగు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం జులై9 నాటి తిరుగుబాటుతో పతాక స్థాయికి చేరింది. లంకలో రాజపక్సె కుటుంబ పాలనకు చరమగీతం పాడాయి. అధ్యక్ష భవనం, ప్రధాని నివాసం తిరుగుబాటుదారుల పాదాక్రాంతమయ్యాయి. దీనికి సరిగ్గా రెండు నెలల క్రితం అంటే మే9న ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయడానికి యత్నించిన మహింద రాజపక్సె చివరికి చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు.. నాడు ప్రజాగ్రహానికి భయపడి మహింద రాజపక్సె పారిపోయినట్ట్టే, నేడు గొటాబయ కూడా అధ్యక్ష భవనాన్ని వీడి పారిపోయారు. అధికారంలో కొనసాగడం అసాధ్యమని అర్థమయ్యాకే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని గొటాబయ ప్రకటించారు. పెట్రోలు కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవడం, పాలు, మందులు, ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడడం, బడులు మూతపడడం, రోజుకు 13 గంటలు కరెంటు కోతలతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో గొటాబయ కుటుంబాన్ని అధికారం నుంచి పారద్రోలితే తప్ప దేశానికి నిష్కృతి లేదన్న నిశ్చయానికి ప్రజలు వచ్చారు. సంపన్నులపై పన్నులు భారీగా తగ్గించడం, రసాయనిక ఎరువుల వాడకంపై నిషేధం ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ దివాళాకు ఒక ముఖ్య కారణం. గొటాబయ నిష్క్రమణతో శ్రీలంక చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి తెరపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కలసి జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని వచ్చేవారం ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నాయి. శ్రీలంక ఎదుర్కొంటున్న బహుముఖ సంక్షోభాన్ని జాతీయ ఐక్యతా ప్రభుత్వం పరిష్కరించేస్తుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్న అధిక ధరలు, ఆహారం, ఇతర నిత్యావసరాల కొరతను పరిష్కరించడం తాత్కాలిక ప్రభుత్వం ముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. ఇది నెరవేరిస్తే చాలు.
నయాఉదారవాద ఆర్థిక విధానాలను మొదటిగా అమలు చేసిన దేశాల్లో శ్రీలంక ఒకటి. దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలే నేటి శ్రీలంక దుస్థితికి ప్రధాన కారణం.ఈ వినాశకర విధానాల నుంచి తప్పుకుని, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలు కోరుకుంటున్నారు. ఇది జాతీయ ఐక్యతా ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే ఈ పని చేయాలి. షెడ్యూల్ ప్రకారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగాలంటే ఇంకా 28 నెలల వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు వేచి చూడకుండా త్వరలోనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చూడాల్సిన అవసరమెంతైనా ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో బయటి జోక్యానికి ఎంతమాత్రం అవకాశమివ్వరాదు. శ్రీలంక భౌగోళికంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇటు ఆసియాకు, అటు తూర్పు, పశ్చిమ దేశాలకు నావికాయానం ఈ దీవి గుండానే సాగుతుంటాయి. ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బ తీయడమే లక్ష్యంగా అమెరికా క్వాడ్, బిస్మిటెక్ వంటి కూటముల ద్వారా ఈ ప్రాంతంపై పట్టు కోసం పావులు కదుపుతున్నది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పడేలా చూసేందుకు అది జోక్యం చేసుకోవాలని చూస్తున్నది. కొలంబోలోని అమెరికా రాయబారి జులీ చుంగ్ ఇటీవల స్థానిక జర్నలిస్టులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనినే బలపరుస్తున్నాయి. శ్రీలంకను ఆదుకునేందుకు ఏ మేరకు సాయం అందించాలనేది అక్కడ ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి ఉంటుందని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీలంకకు సాయం అందించాలంటే ఆ దేశం 'సానుకూల సంస్కరణలను' అమలు చేయాలని ఆమె షరతు విధించారు. దీనిని బట్టే శ్రీలంకలో అమెరికా జోక్యం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో ఏర్పడే తదుపరి ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదులు విసిరే బిస్కత్తులకు ఆశపడి వాటి వలలో చిక్కుకోకుండా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుత సంక్షోభానికి దేశీయంగా పరిష్కారం వెతకాలి. మొత్తం మీద శ్రీలంక పరిణామాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేసే దేశాలకు ప్రత్యేకించి భారత్‌కు ఒక హెచ్చరికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.