
ముంబయి : వన్డే ప్రపంచ కప్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. ఈ జట్టు ఆట తీరుపై తీవ్ర విమర్శలచ్చాయి. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి రాజీనామా చేయగా.. తాజాగా ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు క్రీడల మంత్రి రోషన్ రణసింగే ప్రకటించారు. ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు రావడంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఘోర పరాజయం...
ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఘోరంగా విఫలమైంది. టీమిండియా బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు రేగాయి. వరల్డ్ కప్ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా అవతరించింది. అంతకుముందు ఆసియా కప్ ఫైనల్‌లోనూ 50 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
మాజీ కెప్టెన్ నేతృత్వంలో తాత్కాలిక కమిటీ నియామకం
మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఏడుగురు సభ్యులు కలిగిన ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్డు విశ్రాంత న్యాయమూర్తి కూడా ఉన్నారు. పాత బోర్డు కార్యదర్శిగా పని చేసిన మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. వరల్డ్ కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇలాంటి నిర్ణయం వెలువడటం గమనార్హం.
తక్షణమే వారంతా రాజీనామా చేస్తే బాగుండేది : శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే
శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే మాట్లాడుతూ ... బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదన్నారు. తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేదని... బోర్డులో అవినీతి మితిమీరిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.