Jul 26,2023 20:56

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండోటెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టు పట్టు బిగించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 178పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్‌ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 563పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌(201) డబుల్‌ సెంచరీకి తోడు అఘా సల్మాన్‌(132నాటౌట్‌) సెంచరీతో కదం తొక్కారు. శ్రీలంక బౌలర్‌ ఫెర్నాండో వేసిన బౌలింగ్‌లో 200 పరుగులు పూర్తి చేసుకున్న షఫీక్‌.. స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూరియ వేసిన బౌలింగ్‌లో 201పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 19ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక సల్మాన్‌ ఇన్నింగ్స్‌లో 15ఫోర్లు, ఓ సిక్సర్‌ ఉన్నాయి. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సల్మాన్‌(132), వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(37) క్రీజ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(39) నిరాశపరిచాడు. ఆ తర్వాత షఫీక్‌, షకీల్‌(57) కలిసి 109పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్తాన్‌ జట్టుకు ఇప్పటికే 397పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించగా.. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 166పరుగులకే ఆలౌటైంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టు 4వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.