
ఐఎంఎఫ్ బెయిలవుట్ మార్గాన్ని ఎంచుకుంటే, ఆ రుణంతో పాటు వచ్చే కఠినమైన పొదుపు చర్యలు కూడా వుంటాయి. శ్రీలంక ప్రజల పోరాటం ఇప్పట్లో ముగిసేలా లేదు. కానీ, ఇప్పటి వరకు వారు సాధించినది...తెగల జాతీయవాదం, మతోన్మాద పోకడలను పెచ్చరిల్లచేసే నిరంకుశ ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక వంటిది. ఏదేమైనా, మీరు స్థిరంగా పాతుకుపోయినట్లు కనిపించవచ్చు. కానీ ప్రజలు ఎప్పటికీ మీ దాస్య శృంఖలాలలో వుండరు. కొంత కాలం పాటు మిమ్మల్ని వేచి చూస్తారంతే.
శ్రీలంకలో జులై 9న ప్రజాశక్తి అద్భుతమైన రీతిలో ప్రదర్శితమైంది. పదులు వేల సంఖ్యలో ప్రజలు అధ్యక్ష భవనాన్ని, అధ్యక్ష సచివాలయాన్ని, ప్రధాని అధికార నివాసాలను చుట్టుముట్టారు. వాటికి కాపలాగా వున్న సైనికులు, పోలీసులను పక్కకు నెట్టి మరీ ఆ భవనాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది పురుషులు, మహిళలు రాజధాని కొలంబో వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స అవినీతి పాలనను, మొత్తంగా రాజపక్స కుటుంబ పాలనను తుదముట్టించడానికి వారు కృతనిశ్చయులై వచ్చారు.
ప్రజాగ్రహాన్ని గమనించిన అధ్యక్షుడు రాజపక్స అధ్యక్ష భవనం నుండి సైనిక స్థావరానికి పరారయ్యారు. జులై 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదే రోజు తెల్లవారుజామున, గొటబయా సైనిక విమానంలో దేశం వీడారు. మాల్దీవులకు చేరారు. ఆ రకంగా, రాజపక్సా కుటుంబానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటులో ఒక అంకం ముగిసింది. అయితే, దేశాన్ని వీడి వెళుతూ గొటబయా, ప్రధాని రణీల్ విక్రమ సింఘెను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. దేశంపై కొద్దిపాటి నియంత్రణనైనా కొనసాగించేందుకు చిట్టచివరిగా చేసిన ప్రయత్నమిది. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేస్తానని రణీల్ విక్రమసింఘె హామీ ఇచ్చారు. గొటబయా రాజీనామా చేసేవరకు ప్రధానిగా కొనసాగేందుకు ఇదొక జాప్యపు ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే, అధ్యక్షుడు లేని పక్షంలో ప్రధాని తాత్కాలిక అధ్యక్షుడయ్యేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది.
దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు రాజపక్సతో సమానంగా తాను కూడా దోషిననే రీతిలో చూసే ప్రజల పట్ల తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విక్రమసింఘెకు కోపమొచ్చింది. తన సోదరుడు మహిందా రాజపక్స మే 9న రాజీనామా చేయాల్సి రావడంతో...ఆ స్థానంలో ప్రధానిగా విక్రమసింఘెను గొటబయా నియమించారు.
ఆయన పార్టీ యుఎన్‌పికి పార్లమెంట్‌లో ఏకైక ప్రతినిధి ఆయనే. రాజపక్సకు వారసుడుగా తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విక్రమసింఘె దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సైన్యాన్ని కోరారు. ఫాసిస్ట్ శక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా యంటూ విమర్శించారు. కానీ ప్రజల అకుంఠిత సంకల్పం మరోసారి ప్రదర్శితమైంది. పాలక వర్గం తీసుకునే ఈ చర్యలను ఎలాగైనా భగం చేయనున్నారు. జులై 9న జరిగిన ముట్టడి, ఆక్రమణల తరహా లోనే ప్రధాని కార్యాలయాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు వందలాది శతఘ్ని గుళ్ళను ప్రయోగించినా వాటికి ఎదురొడ్డి నిలిచి ప్రధాని కార్యాలయాన్ని ఆక్రమించారు.
దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆహారం, ఔషధాల కొరత, ఇంధన నిల్వలు హరించుకు పోవడం, ద్రవ్యోల్బణం పెచ్చరిల్లడం వంటి పరిస్థితులను నిరసి స్తూ, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అధ్యక్షుని సచివాలయం వెలుపల గల గాలె ఫాస్ గ్రీన్ వద్ద చేరుకున్నారు. దాంతో మార్చి 31న అరగలయా (పోరాటం) ఆరంభమైంది.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, విదేశీ రుణాలను దేశం చెల్లించలేకపోవడంతో 'గొటా గో హోమ్' నినాదంతో శాంతియుతంగా సాగుతున్న నిరసనోద్యమం ఒక్కసారిగా పెచ్చరిల్లింది. గాలె ఫాస్ వద్ద గల శిబిరాలను, ప్రధాని మహిందా రాజపక్స అధికార నివాసాన్ని పెద్ద సంఖ్యలో జనం చుట్టుముట్టారు. ప్రధాని మహిందా రాజపక్స అనుచరులు, పాలక పార్టీకి చెందిన వారు ఆందోళనకారులపై దాడికి పాల్పడిన మే 9వ తేదీ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత వచ్చిన ప్రజా తిరుగుబాటుతో ప్రధానిగా మహిందా రాజపక్స వైదొలగాల్సి వచ్చింది. ప్రజా నిరసనోద్యమంలో భాగంగా కార్మిక వర్గం రెండుసార్లు సార్వత్రిక సమ్మెలు నిర్వహించింది. సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారు, అన్ని మతాలకు చెందిన నేతలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. మే 9 తర్వాత అధికారాన్ని పట్టుకుని వేళ్లాడేందుకు గొటబయా చేసిన ప్రయత్నాల్లో భాగంగానే రణీల్ విక్రమ సింఘెను ప్రధానిగా నియమించడం జరిగింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విక్రమ సింఘె వెంటనే పాలక పార్టీ-శ్రీలంక పుదుజన పెరమునా (ఎస్‌ఎల్‌పిపి) నేతృత్వం లోని ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు. కానీ దీనివల్ల గొటబయాకు కాస్తంత ఉపశమనమే చిక్కింది.
ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వున్న కొద్దిపాటి చట్టబద్ధత కాస్తా పూర్తిగా తుడిచిపెట్టబడింది. సైన్యం, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎవరూ కూడా ప్రజా ఉద్యమకారులపై బలవంతంగా చర్యలు తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. రాజపక్స కుటుంబ ఆధిపత్య ధోరణితో రెండు దశాబ్దాలుగా సాగిన రాజకీయాల తర్వాత శ్రీలంక ఇక బయటపడే దారి లేని పరిస్థితికి చేరుకుంది. అంతకుముందు, అధ్యక్షుడిగా మహిందా రాజపక్స సింహళ బౌద్ధ మెజారిటీవాదంపై ఆధారపడి నిరంకుశ పాలనను సంఘటితం చేశారు. అధికారం ఒకేచోట కేంద్రీకృతమవడానికి కార్యనిర్వాహక అధ్యక్ష వర్గం సాధనంగా మారింది. ప్రభుత్వ సంస్థల్లో స్వంతంగా అవినీతి నెట్‌వర్క్‌లు కలిగిన నిరంకుశ పాలన ఏర్పడేందుకు కారణమైంది.
2019లో గొటబయా రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, శ్రీలంక రాజ్యాంగానికి చేసిన 20వ సవరణతో కార్యనిర్వాహక అధ్యక్షునికి విస్తృత అధికారాలు వచ్చాయి. సీనియర్ న్యాయమూర్తుల నియామకంపై పూర్తిగా నియంత్రణను కలిగివుండడం, ఎన్నికల కమిషన్‌పై, పోలీసు కమిషన్‌పై, అవినీతి లేదా ముడుపులపై దర్యాప్తు చేసే కమిషన్‌పై పట్టు దొరకడం వంటివి ఈ విస్తృత అధికారాల్లో వున్నాయి. ప్రధానిగా మహిందా రాజపక్సతో పాటు ఇతర సోదరులు, కుటుంబ సభ్యులను కీలకమైన మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారు. మొత్తం బడ్జెట్‌లో 75 శాతం రాజపక్స మంత్రుల ప్రత్యక్ష పరిధిలో వుంది.
ఆర్థిక వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించలేకపోవడం, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల అమలు వల్లే కాదు. అన్ని రంగాల ఆర్థిక కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణాలుగా వున్నాయి. 13వ తేదీ సాయంత్రం స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పిలుపు ఇచ్చినట్లుగా, రణీల్ విక్రమ సింఘె రాజీనామా చేయాలి. స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాలి. ఈ రాజ్యాంగపరమైన చర్యను సాయుధ బలగాలు ఆమోదించాలి. రణీల్ ఆదేశాలను సైన్యం అమలు చేసి, ఆందోళనకారులపై అణచివేత చర్యలు చేపడితే, ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీలంక ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయట పడడం చాలా కష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ కాగలదు. దేశంలోని ప్రధాన స్రవంతి లోని రాజకీయ వర్గాలు చాలా వరకు ప్రజల్లో విశ్వసనీయతను పోగొట్టుకున్నప్పటికీ, ఏకాభిప్రాయ ప్రధానితో కూడిన అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పడడం అనివార్యమయింది. నిరంకుశవాదానికి మూల కారణమైన కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని రద్దు చేసేందుకు రాజ్యాంగాన్ని సవరించడం ఇక రెండో చర్యగా వుండనుంది.
ముందుకెళ్ళే దారి అంతా వివిధ అడ్డంకులు, అవాంతరాలతో నిండివుంది. ప్రస్తుత పార్లమెంట్‌లో ఇంకా రాజపక్స లకు చెందిన ఎస్‌ఎల్‌పిపిదే ఆధిపత్యంగా వుంది. ప్రజల విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో పొందగల కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం బృహత్ కర్తవ్యంగా వుంది. ఆరు మాసాల తర్వాత తాజాగా ఎన్నికలు జరుగుతాయి. ఇక చివరిగా, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమనే అతి క్లిష్టమైన, అడ్డంకులతో కూడిన కర్తవ్యం ఎదురుగా వుంది. ఐఎంఎఫ్ బెయిలవుట్ మార్గాన్ని ఎంచుకుంటే, ఆ రుణంతో పాటు వచ్చే కఠినమైన పొదుపు చర్యలు కూడా వుంటాయి. శ్రీలంక ప్రజల పోరాటం ఇప్పట్లో ముగిసేలా లేదు. కానీ, ఇప్పటి వరకు వారు సాధించినది...తెగల జాతీయవాదం, మతోన్మాద పోకడలను పెచ్చరిల్లచేసే నిరంకుశ ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక వంటిది. ఏదేమైనా, మీరు స్థిరంగా పాతుకుపోయినట్లు కనిపించవచ్చు. కానీ ప్రజలు ఎప్పటికీ మీ దాస్య శృంఖలాలలో వుండరు. కొంత కాలం పాటు మిమ్మల్ని వేచి చూస్తారంతే.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం/