
శ్రీలంక నేడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తెచ్చిపెట్టుకున్నవి కొన్ని.. వచ్చి పడినవి కొన్ని. అన్నీ కలిసి శ్రీలంక దేశాన్ని అరాచక సుడిగుండంలో చిక్కిన ఒంటరి ద్వీపంగా మార్చాయి. దిక్కు తోచని ప్రజల్లో అసహనం పెరిగి ప్రధాని నివాసాన్ని, అధ్యక్షుడి భవనాన్ని ధ్వంసం చేసేంతగా పురికొల్పాయి. ఒకప్పుడు ఆసియాలో మానవ వనరుల అభివృద్ధి సూచీల్లో, మలేరియా నియంత్రణలో మంచి పని తీరు చూపిన దేశం వివిధ కారణాలతో దిగజారుతూ వచ్చింది. విపత్కర సమయంలో విజ్ఞత చూపాల్సిన నాయకత్వం తన అజ్ఞానం, అవినీతి, అహంకారాలతో పరిస్థితిని మరింతగా దిగజార్చింది. వాటి ఫలితం ఈ దారుణ దుస్థితి. శ్రీలంకకు ఆదాయ వనరు పర్యాటకం. 2017లో ఈస్టర్ నాడు వివిధ చర్చిలలో తీవ్రవాదుల బాంబు పేలుళ్ల ఘటన అనంతరం పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆపై గోరుచుట్టుపై రోకలి పోటులా వచ్చిన కరోనా ఉపద్రవం వల్ల అంతో ఇంతో ఉన్న పర్యాటకం పూర్తిగా కుదేలైంది. మరో వైపు ప్రధాని, అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి ఒకే కుటుంబం చేతికొచ్చి వారు ఆడిందే ఆటగా తయారైంది. వారు దేశాన్ని ఒక్కసారిగా సేంద్రీయ వ్యవసాయం వైపు నెట్టారు. అది కూడా ఎరువుల దిగుమతి భారం తప్పించడానికి. వైఫల్యం చెందితే ఏం చేయాలన్న దానిపై రెండో ఆలోచన లేకుండానే చేసిన ఆ ప్రయోగం వికటించి దిగుబడులు మూడింట ఒక వంతుకి పడిపోయాయి. ఆ దేశం ఎగుమతులు చేస్తున్న తేయాకుదీ అదే పరిస్థితి. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి తిండి గింజలు కూడా తెచ్చుకోలేని దుస్థితి. పైగా మితిమీరిన విదేశీ అప్పులు. అప్పులతో నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగి వినియోగం లేకపోవడంతో నిరర్ధక ఆస్తులుగా మిగలడం. అధికారిక కుటుంబ అసమర్థత, అవినీతి...అన్నీ కలిసి దేశాన్ని, ప్రజల్ని కనీస అవసరాలు తీరని స్థితికి నెట్టింది. నాయకత్వం విజ్ఞత చూపితే ఇంత భయానక దృశ్యం ఉండేది కాదు. ప్రజలకు నమ్మకం పోయి ఆగ్రహ జ్వాల రేగేది కాదు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతి నెలకొనాలి. అఖిల పక్షాల ప్రభుత్వం ఏర్పడాలి. బయట పడే మార్గం చూడాలి. ఆర్థిక దుస్థితి అమాంతం తగ్గే అవకాశం లేదని, కొన్ని త్యాగాలు, కొంత సంయమనం అవసరమని ప్రజల్ని ఒప్పించాలి. పరిస్థితులు చక్కబడడానికి అంతర్జాతీయ సమాజం స్పందించాలి. వారి దుస్థితిని సొమ్ము చేసుకునే ధోరణి కాకుండా మానవతా దక్పథంతో సాయం చెయ్యాలి. పాలన, ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో అన్నదానికి శ్రీలంక పరిణామం ఒక పాఠం..ప్రజలకైనా.. ప్రభువులకైనా.
- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.