నియామె : కొత్త ప్రభుత్వాధినేతగా నైజర్ జనరల్‌ను సైన్యం ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ మద్దతు కావాలంటూ జనరల్ విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. కాగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం జిహాదీలపై పోరును దెబ్బతీయగలదను ఆందోళనలు పెరుగుతున్నాయి. దేశ రాజ్యాంగం రద్దు చేయబడిందని, జనరల్ అబ్దుర్‌రహమాన్ టెకియాని ఇన్‌చార్జిగా వున్నారని సైనిక ప్రతినిధి కలుల్ మేజర్ అమదోవు అబ్దరామెనె టివిలో ప్రకటించారు. అధ్యక్ష భవన గార్డులు అధ్యక్షుడిని నిర్బంధించినప్పటి నుండి మిలటరీలోని వివిధ వర్గాలు ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతున్నాయి. నైజర్‌లో సైనిక కుట్రను అంతర్జాతీయ సమాజం, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ గ్రూపు ఎకొవాస్ తీవ్రంగా ఖండించింది. దేశంలో నెలకొను పరిస్థితిపై అత్యవసరంగా సమీక్ష జరిపి, ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించేందుకై ఆదివారం అబుజాలో అత్యవసర సమావేశం జరగనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అత్యవసరంగా సమావేశమై చర్చించింది. నైజర్‌లోని పౌర, సైనిక సిబ్బందిపై తీవ్రవాదులు దాడులు జరుపుతున్నారు. కానీ పొరుగున వున్న మాలి, బుర్కినో ఫాసోల్లో నెలకొనుంతగా భయంకరమైన పరిస్థితులు లేవు.