Aug 21,2023 09:42

నియామె: నైగర్‌ మూడేళ్లలో తిరిగి పౌర పాలన కిందికి వస్తుందని సైనిక ప్రభుత్వ అధినేత జనరల్‌ అబ్దోరహ్మాన్‌ చియాని ప్రకటించారు. అదే సమయంలో దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో తల దూర్చాలని ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని పొరుగు దేశాలను హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన జాతి నుద్దేశించి టివిలో ప్రసంగిస్తూ, ఈ పరివర్తనకు అనుసరించాల్సిన నియమావళిని తన ప్రభుత్వం నెల రోజుల్లో ఖరారు చేస్తుంని అన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందని అన్నారు. యుద్ధాన్ని తన ప్రభుత్వం కానీ, నైజీరియా ప్రజలు కానీ కోరుకోవడం లేదు, చర్చలకు తాము కట్టుబడి ఉన్నాం. దేశాన్ని ఆక్రమించాలని బయటి శక్తులు చేసే ఎలాంటి యత్నాన్ని అయినా తిప్పికొడతామని జనరల్‌ చియాని తెలిపారు. నైగర్‌లో జోక్యం చేసుకోవడం పార్కులో నడకలాంటిదని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టేనని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేసే మార్గాన్ని కనుగొనేందుకు ఇరుపక్షాలు కలిసి కూర్చొని చర్చించుకుంటాం. అందరి ప్రయోజనాలకు ఇది అవసరమని చియాని అన్నారు. శుక్రవారం పశ్చిమ ఆఫ్రికా దేశాల కూటమి ఎకోవాస్‌ రాజకీయ వ్యవహారాలు, శాంతి, భద్రతల కమిషనర్‌ అబ్దుల్‌ ఫతువా మాట్లాడుతూ, నైగర్‌లో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సైనిక చర్యకు ముహూర్తం నిర్ణయించామని చెప్పారు. జోక్యానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కూటమిలోని 15 సభ్య దేశాలకు గాను 11 దేశాలు చెప్పాయని, అందుకు తమ బలగాలను పంపేందుకు సంసిద్ధత తెలిపాయని అన్నారు. నైగర్‌లో భ్రష్టు పట్టిన అధ్యక్షుడు బజూమ్‌ని తిరిగి ఎలాగైనా ప్రతిష్టించాలని ఫ్రాన్స్‌, అమెరికా, ఇయు దేశాలు అనేక విధాలుగా పాకులాడుతున్నాయి. ఎకోవాస్‌ కూటమి మాజీ వలస పాలకులైన ఫ్రాన్స్‌కు వత్తాసు పలుకుతోందని నైగర్‌, ఇతర సహేల్‌ ప్రాంతంలోని దేశాలు విమర్శించాయి. నైగర్‌లోని యురేనియం నిక్షేపాలను యథేచ్ఛగా కొల్లగొట్టుకుపోతున్న ఫ్రాన్స్‌కు ఇప్పుడు కొత్త ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. దీంతో ఫ్రాన్స్‌లో అణు రియాక్టర్లకు చాలా ముఖ్యమైన ఇంధనం ఆగిపోతుంది. యురేనియం నిల్వలను తరలించుకుపోవడానికి గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. యురేనియం ఒక్కటే కాదు, లిథియం, బంగారం వంటి విలువైన ఖనిజ సంపదపైన మాజీ వలసపాలకుల ఆధిపత్యం ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నది. ఈ పని కోసమే 1500 మంది సైనికులతో ఫ్రాన్స్‌, వెయిÊ య మంది సైనికులతో అమెరికా అక్కడ తిష్టవేశాయి. వనరుల తరలింపునకు అడ్డంకిగా ఉన్న సైనిక ప్రభుత్వాన్ని తప్పించేందుకు ఫ్రాన్స్‌, అమెరికా, ఇతర యూరోపియన్‌ దేశాలు, ఆఫ్రికాలో వాటికి తాబేదారుగా ఉన్న ఎకోవాస్‌ తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. నైగర్‌పై ఆంక్షలు కూడా విధించాయి.
            అయితే ఈ ఆంక్షలను తాము వ్యతిరేకిస్తున్నామని చాద్‌, గినియా దేశాల్లోని సైనిక ప్రభుత్వాలు హెచ్చరించాయి. బుర్కినా ఫాసో, మాలి ఇంతకుముందే ఈ విధమైన ప్రకటన చేశాయి. నైగర్‌లో సైనిక ప్రభుత్వాన్ని తొలగించేందుకు బయటి నుంచి జరిగే ఎటువంటి సైనిక జోక్యాన్ని తాము అనుమతించేది లేదని ఈ నాలుగు దేశాలు స్పష్టం చేశాయి.