Aug 13,2023 13:12

నియామె : నైగర్‌పై దాడి చేయడానికి గల అవకాశాల గురించి చర్చించడానికి త్వరలో సమావేశమవ్వాలని పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి ఎకోవాస్‌ బ్లాక్‌కి చెందిన దేశాల సైన్యాధ్యక్షులు భావిస్తున్నారు. జులై 26వ తేదీన నైగర్‌లో అధికారాన్ని అక్రమంగా స్వాధీం చేసుకున్న సైన్యాధిపతిని పదవి నుండి తొలగించేందుకు సాయుధ జోక్యం అవసరమంటూ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టింబు పార్లమెంట్‌ను కోరారు. అయితే, నైజీరియా పార్లమెంట్‌ దీనిని తిరస్కరించింది. నైగర్‌లో ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని పశ్చిమాఫ్రికా ప్రాంతీయ బ్లాక్‌ ఎకోవాస్‌ ఇప్పటికే అల్టిమేటమ్‌ జారీ చేసింది. నైగర్‌ సైన్యంలో దాదాపు 5వేల మంది సైనికులు వున్నారు.
           అయితే, ఏయే దేశాలు సాయం చేయడానికి ముందుకు వస్తాయనేది ఇంకా స్పష్టం కాలేదు. తాము 850మంది సైనికులను పంపిస్తామని ఐవరీ కోస్ట్‌ ఒక్కటే ఇప్పటివరకు ప్రకటించింది. ఒక బెటాలియన్‌ను పంపి, అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు అందచేయనుంది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహ్మద్‌ బజూమ్‌ను తిరిగి పదవిలో కూర్చోబెట్టేందుకు కృత నిశ్చయంతో వున్నామని ఐవరీ కోస్ట్‌ అధ్యక్షుడు తెలిపారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ ఆ ప్రకటనకు మద్దతునిచ్చింది. అయితే నియామె వీధుల్లో సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. 'ఇది మా సొంత వ్యవహారం, వారిది కాదు' అని సైనిక ప్రభుత్వ మద్దతుదారుడు ఒకరు వ్యాఖ్యానించారు. సైనిక తిరుగుబాటు ఎందుకు జరిగిందో వారికి తెలియదని అన్నారు. ఒకవేళ ఎకోవాస్‌ బ్లాక్‌ దాడి చేసినట్లైతే తాము నైగర్‌కు సాయంగా వస్తామని పొరుగుదేశాలైన మాలి, బుర్కినా ఫాసోలు ప్రకటించాయి. విదేశీ శక్తులు దాడి చేస్తే ప్రస్తుతం గృహ నిర్బంధంలో వున్న అధ్యక్షుడు మహ్మద్‌ బెజూమ్‌ను చంపేస్తామని జుంటా ప్రతినిధులు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలాండ్‌కి చెప్పారని అమెరికన్‌ అధికారి ఒకరు చెప్పారు.