అబుజా : నైజీరియాలోని అతిపెద్ద కార్మికుల సమూహం లేబర్ కాంగ్రెస్ రెండు రోజుల మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. నెలరోజుల్లో కార్మికులు సమ్మె చేపట్టడం ఇది రెండోసారి. నైజీరియా ప్రభుత్వం పెట్రోల్ సబ్సిడీని తొలగించడంతో జీవనవ్యయం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే.. ఆర్థికవ్యవస్థను స్తంభింపజేస్తామని లేబర్ కాంగ్రెస్ మంగళవారం హెచ్చరించింది. సోమవారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలను లేబర్ కాంగ్రెస్ తిరస్కరించింది.
ఈ ఏడాది మేలో పెట్రోల్ సబ్సిడీని తొలగిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ప్రకటించిన సంగతి తెలిసిందే. సబ్సిడీ తొలగించడంతో నైజీరియా కార్మికులు, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని లేబర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్త చేసింది. వేతనాల పెంపుతో పాటు కార్మికుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే రెండు వారాల పాటు నిరవధిక బంద్ పాటిస్తామని లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోరు అజెరో హెచ్చరించారు. రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని అన్నారు.
సమ్మెతో కార్మికుల పరిస్థితి మరింత దిగజారుతుందని కార్మిక శాఖ మంత్రి సైమన్ లాలాంగ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని అన్నారు. సోమవారం సాయంత్రం కార్మిక మంత్రితో చర్చలను తిరస్కరించారు.