Oct 22,2023 10:44

ఇంటిలో రెండవ సంతానం మా అమ్మ. తనకు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ప్రతి మనిషికి బాల్య దశ మరచిపోనిది. మరపురానిది. కానీ అమ్మకి బాల్యం, యవ్వనం తెలియకుండానే తన జీవితం కొనసాగింది. చిన్నతనం నుండే నాన్నకి పెద్ద కొడుకులాగా, ఎంతో తోడ్పడింది. చదువుకోవాలని అమ్మకి ఎంతో ఆశ. కానీ అమ్మకది అందని ద్రాక్షే అయ్యింది.
ఇంటిలో పెద్ద కూతురు కావడం వల్ల ఇంటిపని, నాన్నంటే ఇష్టం కావడంతో ఆయనకి వెన్నుదన్నులా, తన అన్నతో కలిసి వ్యవసాయపనుల్లో సమంగా కష్టపడేది. తండ్రికి కూతురిపై ఉన్న నమ్మకంతో అన్ని బాధ్యతలు అప్పగించేవారు. ఆర్థికంగా తన తండ్రికి ఎంతగానో సహాయపడేది. వ్యవసాయ పనులలో లింగ వ్యత్యాసం లేకుండా తన కాయాన్ని కష్టపెట్టేది.
బాల్యం ఎవరికైనా ఆట, పాటలతో సరదాగా గడుస్తుంది. కానీ మా అమ్మకి ఆ బాల్యం తెలియదు. పెద్దలపై గౌరవమో, తెలియనితనమో!? తన అతి చిన్న వయస్సులోనే పెళ్ళికి మారుమాట చెప్పలేదు. వెనుక చెల్లి వుంది కాబట్టి చేసుకోవాలనుకుందో, చేసుకోక తప్పదనుకుందో ఏమో..?
ఇక మా నాన్న.. ఆయన అంటే నాకిష్టం. మంచి మనిషి. ఆరడుగుల అందగాడు. చిరునవ్వులకు చెలికాడు. ఇంటిలో రెండవ కుమారుడు. మంచీ చెడు బాగా తెలిసినవాడు మా నాన్న. అన్ని సందర్భాల్లోనూ సర్దుకుపోయే స్వభావం కలవాడు. నాన్నకి అన్న, తమ్ముడు ఉన్నారు. ఏడో తరగతి వరకే చదువుకున్నాడు. వ్యవసాయ కుటుంబం. మా నాన్న, వాళ్ళ నాన్నకి (తాత) వ్యవసాయ పనులలో తండ్రికి కుడిచేయిలా వ్యవహరించేవాడు. వ్యవసాయంలో తండ్రికి, చదువు ఖర్చుల్లో అన్నకు ఎంతగానో సహకరించేవాడు. తన అన్న ఆ రోజులలో సి.ఎ విద్య మద్రాసులో చదువుకున్నాడు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో సి.ఎ చదివించడం మామూలు విషయం కాదు. తండ్రితో పాటుగా తను కూడా ఒక భుజంపై కండువా, మరో భుజంపై అన్న చదువు బాధ్యతలు వేసుకున్నాడు. నాన్న వ్యవసాయ పనులలో చురుకుగా వుండేవాడు. నాన్నది జాలి హృదయం. నిజాయితీ కలిగిన మనిషి. ఊరంతా మన అనుకునే మనిషి మా నాన్న.
అమ్మ.. నాన్నకి అక్క కూతురు అవుతుంది. అక్క అంటే నాన్న వాళ్ళ బాబాయి కూతురు. అమ్మమ్మకి మా నాన్న ఎలాంటివారో బాగా తెలుసు. వీటన్నింటితో పాటు పుట్టింటిపై అపారమైన ప్రేమ. అమ్మ వివాహం అమ్మమ్మ ఇష్టంతో, పట్టుదలతో జరిగింది.
అమ్మానాన్నలు ఇద్దరూ కష్టం తప్ప వేరేమీ తెలియనివారు. అమ్మ, నాన్న వివాహం ఇంట్లో మొదటి వేడుక. చాలా ఘనంగా చేశారు. పెళ్ళి పెద్దలుగా నాన్న వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ తల్లిదండ్రుల పాత్ర పోషించారు. ఎందుకంటే కరణం పెద్ద కొడుకు అదే నాన్న వాళ్ళ అన్నయ్య (సి.ఎ) పెళ్ళి కూడా అదే రోజు కావడం వలన మా తాత నాయనమ్మలు మా పెదనాన్న పెళ్ళిలో ఉన్నారు.
మా అమ్మమ్మగారి ఊరంతా అల్లుడి (మా నాన్న) ని చూసి అందంగా ఉన్నాడని ప్రశంసించారు. మా అమ్మమ్మ చాలా సంతోషపడింది తన పుట్టింటి వారిని చూసుకొని. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు కదా! పెళ్ళితో పుట్టింటి బాధ్యత తీరిందనుకున్నారేమో అమ్మమ్మ, తాతయ్య.
పాపం అమ్మ.. ఎవరికైనా పెళ్ళితో జీవితం మారుతుంది.. కొత్త జీవితం వస్తుంది అంటారు. కానీ అమ్మ విషయంలో అలా జరగలేదు. అన్నకి ఉద్యోగం వస్తే తనకి కొంత శ్రమ తగ్గుతుంది అనుకొని ఉంటాడు నాన్న. కానీ వాళ్లిద్దరూ తలచినవే జరిగితే ఇక జీవితం ఏముంది?
ఎన్నో రకాల ఆర్థిక అవసరాలను అణచి, అన్న చదువుకు సహాయపడ్డారు నాన్న, తాత (నాన్న వాళ్ళ నాన్న). పెళ్ళి జరిగిన కొన్నాళ్ళకే కుటుంబంలో కలహాలు. వాడంటే చదువుకున్నవాడు కాబట్టి పని (వ్యవసాయం) చేయనవసరం లేదు. కానీ మీరు చదువుకోలేదు కదా! కాబట్టి మీకు వ్యవసాయమే సాయం చేయాలి అనేశారు.
నాన్న వాళ్ళ అన్నకి జాబ్‌ రాలేదు. వ్యవసాయం చేయరు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నవారు, గొప్పవారు. అమ్మానాన్నలకి పనిభారం పెరిగింది. భుజం మీద వేసుకున్న కండువా బాధ్యతలను వదలి దిగిరానంది. చదువుకున్న వారికీ, చదువుకోని వారికి ఎంతో వ్యత్యాసం? బట్టలలో వ్యత్యాసం, గౌరవంలో వ్యత్యాసం. అది ఇంటి నుండే ప్రారంభమైంది. నాన్న అన్న (పెదనాన్న) తనకు ఉద్యోగం వస్తే తన తమ్ముడికి (నాన్నకు) సహాయపడవలసి వస్తుందనేమో.. పెళ్ళి అయిన కొన్నాళ్ళకే వేరు కాపురం పెట్టాడు.
అన్నట్టు నా పేరు మాధవి. నేను ఒక స్కూల్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాను. అమ్మ కథను రాస్తున్న సమయంలో కొంత మంది స్టూడెంట్స్‌ లైబ్రరీకి వచ్చి నా ముందున్న పేపర్స్‌ను చూసి అది ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరచారు. మా అమ్మ కథ అని చెప్పాను. వారికి కథ తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువైంది. అమ్మ విషయాలు గుర్తు తెచ్చుకుని బాధపడుతున్న సందర్భాల్లో 'మేడమ్‌! మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. కథను కంటిన్యూ చేయండి' అని చాలా ప్రోత్సహించారు.
పెద్దనాన్న సిఎ చదువుకున్నాడు కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఆస్తిలో పంపకాలు నాన్నకి, మా బాబాయి మాత్రమే అని నిర్ణయించారు. కానీ ఎవరూ ఊహించని సంఘటన. పెద్దనాన్న కుడి చేయి చలనం లేకుండా పోయింది. అలా జరిగేసరికి నాన్న చలించిపోయారు.
వేరుకాపురం పెట్టిన కొన్నాళ్ళకు ఇలా జరిగిందని అందరూ బాధపడ్డారు. మా నాన్న వయస్సులో చిన్న అయినా ఆలోచనలో చాలా పెద్ద. మా నాన్న చేసిన పనికి మేము ఇప్పటికీ చాలా గొప్పగా ఫీల్‌ అవుతాము. అన్న పరిస్థితి చూసి ఆస్తిని ముగ్గురు సమానంగా పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. చాలా గొప్ప నిర్ణయం. గతాన్ని మరచిపోతే కాలం తప్పక గుర్తుచేస్తుంది. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా మన మూలాల్ని మరచిపోకూడదు.
జీవితం పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు నేర్పిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులలో ఆస్తుల కోసం, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటున్నారు. కానీ ఆస్తితో ఉన్న బంధం కన్నా, అన్నతో ఉన్న అనుబంధమే మిన్న అని చెప్పకనే చెప్పాడు మానాన్న.
                                                             ***********************************************************
అమ్మా, నాన్నల కల సొంత ఇల్లు. మా ఇంటి నిర్మాణం మా కళ్ళ ముందే జరిగింది. అమ్మకు 15 సంవత్సరాల వయస్సులో అన్నయ్య, 17 సంవత్సరాల వయస్సులో నేను పుట్టాము. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. చిన్నవయస్సులో పెళ్లి, పిల్లలు. దాంతో 22 సంవత్సరాల వయస్సులోనే గర్భసంచి తొలగించారు. వేరు కాపురాలు పెట్టాక, అద్దె ఇంటిలో చాలా రోజులు ఉన్నాము. ఉన్న సమస్యలతో పాటు అద్దె ఇంటి కష్టాలు.. తిన్నా, తినకపోయినా నెల తిరిగే సరికి అద్దెకట్టాలి. పిల్లలు అల్లరి చేయకూడదు, నీళ్ళు ఎక్కువ వాడకూడదు. ఇలా అద్దె ఇళ్లల్లో కాపురం సాగించారు. ఇలాంటి అనుభవాలు గుండెలో గూడు కట్టుకోగా, సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు నాన్న.
బంధువులు ఒకరు స్థలం అమ్ముతున్నారని తెలిసి చాలా ఆలోచించి ధైర్యంచేసి, స్థలం కొన్నారు. ఇల్లంటే ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడినది. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టడానికి కొంత అప్పు, కొంత కూడబెట్టిన డబ్బు మా ఇంటి నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అమ్మ బంగారం అమ్మకూడదని నాన్న కొంత తటపటాయించినా అమ్మేయమని అమ్మ ధైర్యం చెప్పింది.
దాంతో ఇల్లు కట్టుకోవడానికి ముందుకు దిగారు. మా ఇంటి నిర్మాణంలో ఇప్పటికీ ఒక విషయం గుర్తుంది. నేను కూడా ఆడుతూపాడుతూ గోడలకు నీరు పెట్టాను. ఎంతైనా చిన్నతనంలో చేసిన పనులు సరదాగా ఉంటాయి కదా! ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ మా ఇంటిని నిర్మించారు. ఇప్పటికీ నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఆ ఇంటి నిర్మాణంలో వాడిన ప్రతి ఇటుక మా అమ్మ, నాన్నల కష్టానికి నిదర్శనం. అమ్మానాన్నలు ఇరువైపుల దగ్గరి బంధువులను గృహప్రవేశానికి ఆహ్వానించారు. చాలా సంతోషంగా శుభకార్యం జరిగింది. నాకు అపుడు 7-8 ఏళ్లు ఉంటాయేమో! బాదుషా పెట్టారు భోజనాలలో.. అదంటే నాకిష్టం. అమ్మ, నాన్న వాళ్ళ పనులలో చాలా హడావిడిగా ఉన్నారు. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచింది. నాకు మా ఇల్లంటే చాలా ఇష్టం. అప్పుడు నేను మూడో తరగతి, అన్నయ్య ఐదో తరగతి చదువుతున్నాం.


- ధూళిపాళ్ళ మాధవి కిషోర్‌
99497 35253