Oct 22,2023 06:56
  • పుట్టబోయే బిడ్డ కోసం ఇంటిల్లిపాదీ ఎన్నో ఆశలు.. ఆనందాలు కలబోసుకుని ఎదురు చూసే సమయంలో.. ఆ బిడ్డ అవకరంతో పుట్టి ఆశలు అడియాశలైతే.. ఎదురుచూపులు నిస్తేజమైతే..! మరి ఆ బాధ వర్ణనాతీతమే కదా! అలాంటి ఒక కలికితురాయిలాంటిదే ఈ పోలియో వ్యాధి. ఇది పోలియోమైలిటిస్‌ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. 'పోలియో' అంటే బూడిద. 'మైలోన్‌' అంటే మజ్జ. ఎముక మజ్జలోనే ప్రారంభమవుతుంది ఈ పోలియోవైరస్‌ ఉరఫ్‌ పోలియోమైలిటిస్‌. ప్రతి బిడ్డను దీని నుండి రక్షించుకోవాలి. రెండు చుక్కలు నిండు జీవితాన్నిస్తాయంటే ఆనందమే కదా! అందుకే పోలియో టీకా ప్రాముఖ్యతపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో అక్టోబర్‌ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. వెన్నెముక, మెదడు కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేక పోవడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం.. కొన్నిసార్లు తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్‌ అనబడే ఈ వ్యాధి తీవ్రతను బట్టి పక్షవాతం అని కూడా పిలుస్తారు. అసలు పోలియో ఎలా వ్యాప్తి చెందుతుంది.. ఏ వయసులో దీనికి గురయ్యే ప్రమాదముంది.. నివారణా చర్యలు ఏమిటి.. అనే వివరాలు తెలుసుకుందాం.

  • చారిత్రక దృక్పథం..

ప్రపంచ పోలియో దినోత్సవం ఒక చారిత్రక దృక్పథం. పోలియో వ్యాక్సిన్‌ను 1955లో వైద్య పరిశోధకుడు జోనాస్‌ సాల్క్‌, ఆయన బృందం తయారు చేయగా 1961లో వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత ఓరల్‌ వ్యాక్సిన్‌ను ఆల్బర్ట్‌ సబిన్‌ అందించారు. ప్రాణాంతక, నివారణలేని వ్యాధికి సహేతుకమైన మందు కనిపెట్టిన జోనాస్‌ సాల్క్‌ పుట్టినరోజు సందర్భంగానే అక్టోబర్‌ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకోవాలని డబ్ల్యుహెచ్‌ఒ, గ్లోబల్‌ కమ్యూనిటీ కలసి నిర్ణయించాయి.

polio-vaccine-importance-awareness-sneha-story3
  • కార్యక్రమ లక్ష్యం..

ప్రపంచ వ్యాపితంగా సేవ, సద్భావన, శాంతి, అవగాహనను పెంపొందించేందుకు ప్రపంచ సేవా సంస్థ రోటరీ ఇంటర్‌నేషనల్‌ పోలియో దినోత్సవాన్ని ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ప్రపంచమంతటా కేంద్ర ప్రభుత్వాలు, డబ్ల్యుహెచ్‌ఒ నాయకత్వంలో గ్లోబల్‌ పోలియో నిర్మూలనా ఇనిషియేటివ్‌.. వ్యాధి నిర్మూలనా చర్యలు చేపట్టాయి. పోలియో వ్యాక్సిన్‌ గురించి అవగాహన పెంచడం, వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం వీటి లక్ష్యం.

polio-vaccine-importance-awareness-sneha-story
  • పోలియో అంటే ..

అసలు పోలియో అంటే.. ఇది ఒక ప్రాణాంతక అంటువ్యాధి. వయసుతో నిమిత్తం లేదు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలపై దీని ప్రభావం ఉంటుంది. పోలియోకు కారణమైన వైరస్‌ పికోర్నావిరిడే కుటుంబం.. ఎంటెరోవైరస్‌ జాతికి చెందినది. పోలియో వైరస్‌ నేరుగా నాడీవ్యవస్థపై దాడి చేస్తుంది. అందువలన ఈ వ్యాధి సోకిన తరువాత తగ్గే అవకాశం లేదు. అయితే పోలియో సోకిన అందరికీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడదు. ఒకే రకమైన లక్షణాలూ కనిపించవు.
వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం అబార్టివ్‌ పోలియో మైలిటిస్‌.. రెండవ రకం పెరాలిటిక్‌ పోలియోమైలిటిస్‌.

  1. అబార్టివ్‌ పోలియోమైలిటిస్‌..

జ్వరం, అలసట, వికారం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, దగ్గు, మెడ పట్టడం, శరీరంలో అన్ని భాగాలూ నొప్పికి గురవడం ఇలాంటి సాధారణ లక్షణాలతో బాధిస్తుంది. కానీ ఇది మందులతో నయమవుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపదు.

          2. పెరాలిటిక్‌ పోలియోమైలిటిస్‌..

ఇది చాలా క్లిష్టమైనది. నేరుగా నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపడం, మెదడు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం లాంటి పరిస్థితుల్లో శాశ్వతంగా ఆ కండరాలు పని చేయకుండా చేస్తుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది.
అంతేకాదు.. ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా కూడా పోలియో వైరస్‌ సోకే ప్రమాదం ఉంది కొందరిలో. అలాంటి సందర్భాల్లో శాశ్వత వైకల్యానికి గురికావలసి వస్తోంది.

polio-vaccine-importance-awareness-sneha-story3
  • పోస్ట్‌-పోలియో సిండ్రోమ్‌..

పోస్ట్‌-పోలియో సిండ్రోమ్‌ కూడా వ్యాధిలో ఒక భాగమే. అంటే వ్యాధి నుండి కోలుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత మరల తిరగబెడుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ఈ వ్యాధి సోకిన రెండు వందల మందిలో ఒకరికి శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

  • వ్యాప్తి ఎలా..

పోలియో వైరస్‌ వ్యక్తి నుంచి వ్యక్తికి, కలుషిత ఆహారం, నీరు, మలం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ పేగుల్లో చేరి నాడీవ్యవస్థపై దాడి చేసి పక్ష వాతానికి గురిచేస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ సులభంగా వ్యాప్తి చెందుతుంది. టాయిలెట్‌ ఉపయోగించిన తర్వాత, భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.

  • నివారణా చర్యలు..

పోలియోకు చికిత్స లేదు. కాబట్టి బిడ్డకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ఒక్కటే నివారణా మార్గం.
టీకాలు..
వ్యాధి నిరోధక టీకాలు రెండు రకాలుగా ఉన్నాయి.
ఒకటి ఇన్‌యాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌, రెండవది ఓరల్‌ వ్యాక్సిన్‌.
ఇనాక్టివేటెడ్‌..
ఇన్‌యాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌.. రోగి వయస్సును బట్టి కాలు లేదా చేతికి ఇంజక్షన్‌ ద్వారా ఈ వ్యాక్సిన్‌ అందిస్తారు.

  • ఓరల్‌..

ఓరల్‌ వ్యాక్సిన్‌.. బిడ్డపుట్టిన తరువాత 6, 10, 14 వారాలలో మూడు మోతాదులు నోటిలో చుక్కల రూపంలో ఇవ్వాలి. 16 నుంచి 24 నెలల మధ్య మరో బూస్టర్‌ డోస్‌ ఇస్తారు. డిప్తీరియా, పెర్టుసిస్‌, టెటానస్‌కు ఇచ్చే వ్యాక్సిన్‌తో కలిపి ఒక మోతాదు ఉంటుంది. నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు మధ్యలో నాలుగో డోస్‌ ఇవ్వాలి. ఒకవేళ సరైన సమయములో వ్యాక్సిన్‌ వేయించకపోతే రెండు టీకాలనూ ఒకేసారి ఇవ్వవచ్చు. పోలియో వ్యాక్సిన్‌లు వ్యాధి కారక వైరస్‌తో పోరాడతాయి.

  • పోలియో రహిత దేశాలు..

మన దేశంలో ప్రతిపౌరుడు పల్స్‌పోలియో పేరుతో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్‌ వేయించడంలో పాలుపంచుకున్నారు. తత్ఫలితంగా 2014 మార్చి 25న పోలియో రహిత దేశంగా ప్రకటింపబడింది. చివరి పోలియో కేసు పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లా నుంచి గుర్తించబడింది. అగేయాసియా ప్రాంతం 27 మార్చి 2014న ది రీజనల్‌ సర్టిఫికేషన్‌ కమిషన్‌ ద్వారా పోలియో రహితంగా ధృవీకరించబడింది. యునైటెడ్‌ స్టేట్స్‌లో చిట్టచివరి పారలైటిక్‌ పోలియోమైలిటిస్‌ కేసు 1979లో నమోదైంది. 1994 నాటికి ఈ వ్యాధి అమెరికాలో పూర్తిగా నిర్మూలించబడింది. 2000 నాటికి చైనా, ఆస్ట్రేలియా, మరో 36 పాశ్చాత్య పసిఫిక్‌ దేశాలలో పోలియో నిర్మూలించబడినట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఐరోపా 2002లో పోలియో నుంచి బయటపడినట్లు ప్రకటించింది.

  • ఇంకా వ్యాధి కారకంగానే..

ప్రస్తుతం నైజీరియా, పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ వంటి నాలుగు దేశాలలో మాత్రమే పోలియో సాంక్రమిక వ్యాధిగా కొనసాగుతోంది. పోలియో వైరస్‌ వ్యాప్తి ప్రపంచంలో చాలావరకు అరికట్టబడినప్పటికీ, పోలియోవైరస్‌ డోస్‌ సరఫరా మాత్రం కొనసాగుతూనే వుంది.
విరాళాలు సేకరించడానికి, వాలంటీర్లను గుర్తించడానికి ఉపయోగపడేలా పోలియో ఇమ్యూనైజేషన్‌కు గుర్తుగా పర్పుల్‌ పింక్‌ రంగును నిర్ణయించారు.

- టి. టాన్యా, 7095858888