Oct 15,2023 07:01

'నాన్నకి నువ్వన్నా చెప్పమ్మా! నేను ఇంటర్మీడియేట్‌లో చేరతాను. స్కూలు ఫస్టు వచ్చాను. నా కన్నా తక్కువ మార్కులు వచ్చినోళ్ళూ, సరిగా చదువు రానోళ్ళూ అందరూ చదువుకుంటున్నారు. నేనూ వాళ్ళతో పాటు కాలేజీకి వెళ్తాను.
'బాగానే వుంది సంబడం! రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకుందంట! ఆయన నా మాట వింటాడంటే? నేను నోరు తెరిస్తే ఇదిల్చికొడతాడు! నా మాట అసలు చెవిలోనికి దూరనిస్తాడా? ఆ గుంజకి చెప్పినా ఒకటే, నేను మీ నాన్నకి చెప్పినా ఒకటే! నా కంటే నువ్వే నయం, ఒకసారి కాకపోతే ఒకసారన్నా నీతో నోరు విప్పి మాట్టాడతాడు!'
'నేను కాలేజీకి పోవటం, చదువుకోవటం ముందు నీకు ఇష్టం వుందా లేదా చెప్పు! అసలు నీకే ఇష్టం లేదట్టుగా వుంది చూడపోతే!'
'నాకు ఎందుకు ఇష్టం లేదు అంజలీ? ఇంటో నా మాట ఏవన్నా చెల్లిద్దా? దేవుడి చిత్తం దాసుడి భాగ్యం అన్నీ. ఆ దేవుడు వరం ఇయ్యాలి కానీ నాదేముందమ్మా! నువ్వు చదువుకుంటానంటే నాకూ ఇష్టమే!'
'మరి అట్టా అయితే నాన్నకి నువ్వే నచ్చచెప్పు! నాకు అసలు ఆయన్ని చూస్తేనే భయం!'
'చిన్నప్పట్నించీ చూస్తన్నావుగా అంజలీ ఆయన ఎవ్వారం! నందిని పందిగానూ పందిని నందిగానూ మార్చవచ్చేమో కానీ, మీ అయ్యని మార్చడం ఎవరి వల్లా కాదమ్మా. ఎక్కడ లేని పెడిదం రోకలి తలకు చుట్టమనే రకం! ఆడోళ్ళంటే కాలి కింద చెప్పులాగ పడి వుండాలంటాడు. ఒక మంచీ చెబ్బరా మాట్టాడుకోవడం ఎన్నడన్నా వుందీ? అదేమంటే, నీకేం తెల్సే నోర్మూసుకుని పడి వుండు ఒక పక్కన అంటాడు. ఆడ ముండలు అనే మాట తప్ప ఆడోళ్ళు అనే మాట మీ నాన్న నోట్లోంచి రాగా ఎప్పుడైనా విన్నావా? ముండలూ రండలూ అనడం తప్ప నోటికి మంచి కూతలు వస్తే కదూ ఎనాడైనా?'
'సరేనమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటా? నేను మాత్రం కాలేజీలో చేరాల్సిందే, చదువుకోవాల్సిందే!'
'నువ్వే మీ నాన్నని అడుగు అంజలీ! నేను అడిగితే ఇంకా ఎతిరేకానికి వస్తాడు! మొదటికే మోసం వచ్చిద్ది. నాకంటే నువ్వే నయం! ఆ పెడసరానికి నేను కాబట్టి ఇంతకాలం భరించాను కానీ.. ఇంకొకరైతేనా ఎప్పుడో వదిలిపెట్టి పోయేది!'
'అనవసరమైన మాటలు ఎందుకమ్మా ఇప్పుడు, జరగాల్సిన సంగతి చూడాలి కానీ'
ఇంతలో అంజలి నాన్న వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చాడు.
'ఏందీ, అమ్మాకూతురూ ఇద్దరూ ఒకచోట చేరి కబుర్లు పెట్టారూ! వంట అయిందా? చేలోకి పోవాలి!'
'అయ్యిందైంది. అమ్మాయికి హైస్కూల్లో ఫస్టు వచ్చిందంటయ్యా! బళ్ళో అందరి కంటే అమ్మాయికే ఎక్కువ మార్కులు వచ్చినయ్యంట!'
'అయితే ఏందంట?'
'కాలేజీలో చేరతానంటే, నాదేముందమ్మా మీ నాన్నని అడుగు అని చెపుతున్నా!'
'ఏందీ, కాలేజీలో చేరిద్దీ! చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి వుండాల్సిన పని లేదంటే! పది దాకా చదువుకుంది, అంత మట్టుకి చాలదూ! అంతకంటే ఎందుకు ఇంక ఆడ ముండలకి చదువు? ఉజ్జోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా, రాచకార్యాలు ఏమన్నా చక్కపెట్టాలా? పెళ్ళి చేసుకుని అత్త గారింటికి పోయి కాపురం చేసుకునే దానికి పెద్ద చదువులు కావాల్సి వచ్చినయ్యీ! పిచ్చి పిచ్చి ఎవ్వారాలు చేయమాకండి. ఎంతవరకూ వుండాలో అంతవరకూ వుంటే బాగుండిద్ది!'
'అది కాదు నాన్నా! నేను చదువుకుని, ఉజ్జోగం చేస్తాను. మిమ్మల్ని బాగా చూసుకుంటా.'
'ఉజ్జోగం చేస్తా? చేసిన మట్టుకి చాల్లే! పెళ్ళి చేస్తే అత్తగారింటికి పోయే దానివి, నువ్వు మమ్మల్ని చూసుకునేది ఏందీ? మాకు కొడుకు లేడా, వాడు చూసుకోడా? పెళ్ళయిన తరవాత ఆడ.. బిడ్డవే కానీ ఈడ.. బిడ్డ కాదంట. ఇయ్యేటికో, మీదటికో మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాం. నువ్వు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద ఉజ్జోగం అయినా కట్నం లేకుండా చేసుకునేవోడు ఎవుడన్నా వున్నాడూ? నీకు పెళ్ళి చేసి పంపిస్తే మాకు ఒక బరువూ, బాధా దిగిపోయిద్ది!'
తండ్రితో వాదించీ, ఎదిరించీ ఉపయోగం లేదని అంజలి మౌనంగా వుంది. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రకం తండ్రి. ఇతరుల్ని అర్థం చేసుకునే స్వభావం, ఇతరులు చెప్పేది వినే లక్షణం ఆయనకి బొత్తిగా లేవనే విషయం అంజలికి తెలుసు.
తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోయినా మనసులో మాత్రం చదువుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. రామ్మూర్తి, సులోచన దంపతులకి ఇద్దరు పిల్లలు. ముందు కూతురు అంజలి, తరువాత కొడుకు కోదండరాం. అంజలి పదో తరగతి పాస్‌ కావడమే కాదు, తరగతిలో అందరి కంటే మిన్నగా మార్కులు వచ్చి స్కూలు ఫస్టుగా నిలిచింది. కోదండరాం అక్క కంటే ఒక ఏడాది చిన్న. ఇప్పుడు పదో తరగతిలోకి వచ్చాడు.
అంజలి తరగతిలో 23 మంది విద్యార్థులు. వాళ్ళలో నలుగురు ఆడ పిల్లలు. మిగతా ముగ్గురిలో ఏవరేజ్‌గా చదివే ఒక్క అమ్మాయే కాలేజీలో చేరింది.
అంజలి చదువు మానుకుని ఇంటి దగ్గరే వుంటోంది. అమ్మా నాన్న పొలం వెళ్తే ఇంటి దగ్గర వంట చేయడం, వార పత్రికలూ, మాస పత్రికలూ చదువుకోవడం, రేడియో వినడం, ముగ్గులు నేర్చుకోవడం, ఎప్పడైనా అమ్మ వెంట దగ్గర పొలానికి వెళ్ళి చూసి రావడం.. కాలం జరుగుతోంది.
కోదండరాం పదో తరగతి పరీక్షలు రాశాడు.. ఫలితాలు వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లోనూ బొటాబొటి మార్కులు వచ్చి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు రాలేదు. 40 శాతం మార్కులతోనే గట్టెక్కాడు.
కొడుకు పాస్‌ కావడంతో తండ్రి రామ్మూర్తి ఆనందానికి అంతులేదు. ఫెయిల్‌ అవుతాడనుకున్న కొడుకు పాస్‌ కావడంతో ఎంతో సంతోషించాడు.
'అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా?' అడిగాడు తండ్రి.
'చేసేదేముంది నాన్నా? నేనూ నీతో పాటు వచ్చి అరక దున్నడం నేర్చుకుని, పొలం పని చేస్తా'.
'ఏడిశావ్‌ లే! పొలం పని చేయడం నీవల్లేమయిద్దిరా? ఎగసాయం ఎప్పుడో ఎత్తుబడి పోయింది! పొలంలో దండగలే తప్ప పండగలు చేసుకునే రోజులు పోయినయి! పొలం వద్దులే! ఏదన్నా మంచి కాలేజీ చూసుకుని ఇంటర్మీడియేట్‌ చేరు. పదో తరగతి పాసయ్యావు కదా, అట్నే ఇంటరు కూడా చిన్నగా ముక్కితే తరవాత ఎవ్వారం తరవాత చూడొచ్చు! ఎవుర్నో ఒకర్ని పట్టుకుని చిన్నదో, పెద్దదో వుజ్జోగం సంపాయించుకుంటే నీడ పట్టున కూచుని, చల్లగా బతకొచ్చు! ఉజ్జోగం పురుష లక్షణం! ముందు ముందు పొలం పని చేసుకునే వాళ్ళకి పెళ్ళికి పిల్లని కూడా ఇచ్చే పరిస్థితి లేదు!'
'కాదు నాన్నా! నాకు పొలం అంటేనే ఇష్టం. పదో తరగతి ఏదో పాసయ్యాను కానీ, పెద్దగా నాకు చదువు రాదు. ఎందుకు లేని పోని ఆశ? నాకు చదువు మీద ఇంట్రెస్ట్‌ కూడా లేదు'
'ఇంట్రెస్టు వుండేది ఏందిరా? పొలం వచ్చి ఏం చేస్తా? పొలంలో మాకే సరిపడా పని లేదు. మీ మామయ్యా వాళ్ళ పిల్లలు అందరూ చదువుకోవడంలా? వాళ్ళతో పాటు నువ్వు కూడా చదువుకో! మీ వాడు ఏం చేస్తన్నాడు అంటే, పొలం పని చేస్తన్నాడు అని చెబితే ఎంత నామర్దా ఎవ్వారం! అయినోళ్ళలో తలకాయ ఎత్తుకోవాల్సిన పని లేదూ! ఎందులో అయినా ఒకరి కంటే మిగులుగా వుండాలి కానీ తరుగ్గా వుందామా?' అన్నాడు ఆ తండ్రి ఆజ్ఞాపిస్తున్నట్లుగా.
కోదండరాంకి ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం మీద దగ్గరలోని కాలేజీలో చేరాడు. అంజలికి సంబంధాలు చూస్తున్నారు కానీ ఏవీ కుదరడం లేదు.
ఇంటి దగ్గర ఖాళీగా వున్న అంజలి, తమ్ముడి పుస్తకాలు తీసుకుని, చదవడం మొదలుపెట్టింది తెలివిగల అమ్మాయి కావడంతో సులభంగానే పాఠాలు అర్థం చేసుకుంటోంది.
అంజలికి చదువంటే అమితాసక్తి. ఎంతో ఇష్టం.
'నాన్నా నువ్వు నన్ను కాలేజీకి పంపించలేదు! ఇంటర్మీడియట్‌ ప్రయివేటుగా చదువుకుంటాను. నువ్వు పుస్తకాలు కూడా కొనే పని లేదు. తమ్ముడి పుస్తకాలు వున్నాయి, అవే నాకూ పనికి వస్తాయి. అవే చదువుకుంటా! ఫీజులు కట్టు, చాలు' అంది అంజలి.
ఆయన అయిష్టంగానే ఫీజులు కట్టాడు.
తమ్ముడి టెక్స్ట్‌ బుక్స్‌ చదువు కోవడం, సొంతంగా నోట్స్‌ రాసుకోవడం! తనేమిటో నిరూపించుకోవాలనే తపనతోనూ, సహజమైన ఆసక్తితోనూ ఒక్క నిముషం కూడా వృథా చేసుకోకుండా శ్రద్ధగా చదువు కొనసాగించింది.
మొదట్లో తను చదువుకుంటూ, తమ్ముడ్నీ చదువుకోమని ఒత్తిడి చేసేది. కాలేజీలో లెక్చరర్స్‌ చెప్పే పాఠాలు నోట్స్‌ రాసుకుని రమ్మనేది. వాడికి చదువంటే అసలు ఇష్టం లేకపోవటంతో అక్క మీద అరవటం, కోప్పట్టం, గొడవ పడటం జరిగేది.
'వీడు ఎలాగూ పాస్‌ కాడు. ఎందుకు వీడితో తనకి తగవు!' అని వాడి విషయం పట్టించుకోవటం మానేసింది.
రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
అంజలి ఇంటర్మీడియట్‌ మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తమ్ముడు కోదండరాం ఒక్క సబ్జెక్టులోనూ పాస్‌ కాలేదు.
కూతుర్ని కాలేజీకి పంపకపోయినా.. స్వయంగా చదువుకుని పాస్‌ కావడంతో తండ్రి గర్వపడ్డాడు.
'ప్రైవేటుగా డిగ్రీ కూడా చదువుతా నాన్నా!' అంది అంజలి.
'సరే, నీ ఇష్టం!' అన్నాడు తండ్రి అయిష్టంగానే.
ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో బిఏ డిగ్రీలో చేరింది. వారానికో, రెండు వారాలకో ఒక ఆదివారం యూనివర్సిటీ నిర్వహించే స్టడీ సెంటర్‌ తరగతులకి హాజరయ్యేది. శ్రద్ధగా చదువుకుంటూ, మూడేళ్ళ డిగ్రీ కోర్స్‌ మంచి మార్కులతో పాసయ్యింది.
అంజలి పదో తరగతి పూర్తిచేసి ఆరేళ్ళు అయింది. పది అయిన తరువాత ఒక ఏడాది ఖాళీగా ఇంటి దగ్గర వుంది. ఈ ఆరేళ్ళలో వ్యవసాయంలో అనేక కష్టాలూ, నష్టాలూ! తనకి చూస్తున్నా కూడా సంబంధాలు వెనుకడుగు వేశాయి. ఆ సమయాన్ని అంజలి అవకాశంగా తీసుకుంది.
'కాలేజీలో చేరి బిఈడీ చదువుతా నాన్నా!' అంది అంజలి.
చదువు పట్ల అంజలి ఆసక్తి గమనించి తండ్రి ఇష్టపూర్వకంగా అంగీకరించాడు.
మచిలీపట్టణంలో అంజలి బిఇడీలో చేరింది. బిఇడీ చివరి పరీక్షలు రాస్తున్న సమయంలోనే ప్రభుత్వం డిఎస్సీ ప్రకటించింది. అదీ రాసింది.. టీచర్‌గా సెలక్ట్‌ అయ్యింది.
ఆ తండ్రి ఆనందానికి అంతులేదు. అంజలి కంటే ఆయనే ఎక్కువ ఆనందించాడు.
'మా అమ్మాయి గవర్నమెంటు బడి పంతులమ్మ అయింది' అని ఉత్సాహంగా ఊరంతా చాటింపు వేసినట్లు చెప్పాడు.
మగ పిల్లవాడు అనే గారాబంతో పెంచిన కొడుక్కి అటు చదువూ వంట పట్టలేదు. ఇటు పొలం పనిలోనూ కుదురుకోలేక జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు.
టీచర్‌గా చేరిన అంజలి విద్యాశాఖకి సంబంధించిన పరీక్షలు రాస్తూ, కాల గమనంలో డిఇవోగా ఎంపికైంది.
                                                                               *************************************************
తెర పడింది. ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఆగకుండా హోరెత్తిపోయాయి. జిల్లాలోనే ఎక్కువ మంది విద్యార్థులు వున్న గవర్నమెంటు బాలికల పాఠశాల వార్షికోత్సవం. విద్యార్థులు ప్రదర్శించిన 'అంజలి విజయం' నాటిక. పాత్రధారులు అందరూ ఆడ పిల్లలే! వాళ్ళ నటన, అభినయం, ఆహార్యం, ఆర్ద్రతతో నిండిన సంభాషణలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అందరి మనసుల్లోనూ నాటిక ప్రగాఢమైన అనుభూతి కలిగించింది. వేదిక మీదకు స్కూలు ప్రధానోపాధ్యాయిని రమాదేవి వచ్చారు. 'పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన తల్లితండ్రులకీ, ప్రేక్షకులకీ నా నమస్సుమాంజలి! ఇప్పుడు ప్రదర్శించి, మిమ్మల్ని అలరించిన నాటిక ''అంజలి విజయం''. ఇది కల్పిత కథ కాదు. యథార్థ సంఘటనల సమాహారమే ఈ నాటిక. ఇందులోని అంజలి పాత్ర మన జిల్లా విద్యాశాఖాధికారి అంజలీకుమారి గారి నిజ జీవితమే. బిఇడీలో అంజలిగారు బందర్‌లో నా క్లాస్‌మేట్‌. రూమ్మేటు కూడా. చదువుల సరస్వతి. అంతకుమించి ఎంతో మంచి వ్యక్తి. చదువులమ్మ తల్లే కాదు, మంచి మనసు వున్న మహారాణి కూడా! గొప్ప సంస్కారం వున్న వ్యక్తి. అంజలీకుమారి గారి జీవితం నాకే కాదు, ఎందరికో స్పూర్తి! నాకు వున్న రచనా అనుభవంతోనూ, ఆసక్తితోనూ ఆమె జీవితమే నాటికగా మలిచాను. ఈ నాటిక మీకు నచ్చి, కొందరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతకుమించిన ఆనందం నాకు మరొకటి వుండదు. ఇప్పుడు గౌరవనీయులైన డిఇవో అంజలీకుమారి గారు వేదికను అలంకరించి, తమ సందేశం ఇవ్వ వలసిందిగా కోరుతున్నాను.'
నిరాడంబరంగా వున్న అంజలీకుమారి వేదిక మీదకు వచ్చింది. ప్రేక్షకుల నుంచీ, ఎదురుగా కూర్చున్న విద్యార్థుల నుంచీ కరతాళధ్వనులు ఆకాశాన్నంటాయి.
'ఈ పాఠశాల ఉత్సవానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు. ఇవ్వాళ చాలామంది అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ పురుషులకి ధీటుగా దూసుకుపోతున్నారు. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఇంకా అనేక ఇతర రంగాల్లోనూ పురుషులకి ఏమాత్రం తగ్గకుండా ముందడుగు వేస్తున్నారు. 35 ఏళ్ళ క్రితం మేం చదువుకునే రోజుల్లో పరిస్థితులు వేరు. మహిళలకి ఇప్పుడు ఉన్నంతగా రిజర్వేషన్లూ, ప్రోత్సాహమూ, అవకాశాలూ ఆనాడు లేవు. మా నాన్న రామ్మూర్తి.. నా చదువుకి అడుగడుగునా అడ్డు తగలడమే! ఎలాగోలా ఆ అడ్డంకుల్ని అధిగమించి, ఇవ్వాళ ఇలా మీ ముందుకి రాగలిగాను. సరే, ఇవ్వాళ అమ్మాయిలు అందరికీ అబ్బాయిలతో పాటు సమాన అవకాశాలు లభిస్తున్నాయా అంటే లేదనే చెప్పుకోవాలి. ఉన్నత కులాల్లోనూ, ఉన్నతాదాయ వర్గాల్లోనూ, విద్యా వంతుల కుటుంబాల్లోనూ అమ్మాయిల చదువులకి ఆటంకాలు లేకపోవచ్చు! కానీ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకపడిన కుటుంబాల్లో ఆడపిల్లలు ఎంతమంది చదువు కోగలుగుతున్నారు? ఎంత మంది పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలుగుతున్నారు? అసలు ఆ వర్గాల్లో అక్షరాస్యతా శాతం ఎంత? ప్రభుత్వ ఫాఠశాల అంటే ఇవ్వాళ పేదల పాఠశాల అనే ముద్ర పడిపోయింది. ఇది నిజం కూడా! కాస్తంత ఆర్థిక స్తోమత కలిగినవాళ్ళు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకీ, కార్పోరేట్‌ పాఠశాలలకీ పంపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో చదివేది 90 శాతానికి పైగా పేదపిల్లలే! నేను ఇక్కడకి రావడానికి ముందు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయినీ, నా స్నేహితురాలైన రమాదేవి గారితో చిన్నపాటి సర్వే లేదా పరిశీలన ఒకటి చేయించాను. గత సంవత్సరం పదో తరగతి ఎంతమంది చదివారూ, ఎంత మంది కాలేజీలకి వెళ్ళారూ అనేది ఆ సర్వే. గత ఏడాది ఈ పాఠశాల నుంచి 84 మంది పిల్లలు పది పరీక్షలు రాశారు. నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. ఆ 84 మందిలో 32 మంది మాత్రమే కాలేజీల్లో చేరారట! మిగతా 62 మంది ఆగిపోయారు.
వ్యక్తిగతంగా నేను చదువుకుని, ఉద్యోగం సంపాదించి, నేను వృద్ధిలోనికి రావడం అంజలి విజయం నాటిక. ఇది పూర్తి విజయం కాదు.. పాక్షిక విజయం, ఒక వ్యక్తి కోట్ల కొద్దీ డబ్బు సంపాదించడం, పెద్ద పెద్ద పదవులు పొందడం, ఉన్నత స్థానానికి చేరుకోవడం విజయం సాధించినట్లుగా భావిస్తున్నారు. అలాంటి ఒక పొరపాటు భావన మన సమాజంలో వేళ్ళూనికొని వుంది. వక్ర మార్గాల్లోనో, అక్రమ పద్ధతుల్లోనో, సక్రమ పద్ధతుల్లోనో కోట్లు సంపాదించడం విజయమా? అవేమీ కాదు. పది మందికి మేలు చేయడం, తన పరిధిలో అయినా కొంతమంది అభివద్ధికి పాటు పడటం, సమాజం నుంచి తీసుకోవడమే కాదు, తిరిగి సమాజానికీ ఎంతో కొంత ఇవ్వడం.. ఇవే విజయానికి కొలమానం. నేను చదువుకుని ఈ స్థాయికి చేరుకోవడం కాదు, నాలాగా కొంతమందికి కొన్ని అవకాశాలు అయినా కల్పించడానికి కృషి చేస్తే అది నిజమైన విజయం! ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన, అతి నిరుపేదలైన పదిమంది ఆడపిల్లల ఉన్నత చదువుల బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా తెలుపుతున్నాను. ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ ఏదైనా పూర్తిగా నా స్వంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిగా వాళ్ళ చదువుల భారం నేను తీసుకుంటాను. అయితే ఒక షరతు. వాళ్ళు ఏదయినా పరీక్ష ఫెయిలయితే ఇక వాళ్ళకి నా సహాయం ఆగిపోతుంది. నా జీవిత కాలం ఈ సత్కార్యం చేస్తాననీ, చేయగలననీ భావిస్తున్నాను. వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికీ, స్వశక్తితో జీవించడానికీ నా వంతు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగా మన వృద్ధి కంటే సమాజాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి జీవితం సఫలమవుతుందీ, సంపూర్ణమవుతుందీ, సార్ధకమవుతుంది అని నేను నమ్ముతాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు.'
ఆగని, ఎడ తెరిపి లేని చప్పట్లు మిన్నంటాయి. వేదిక దిగిన వెంటనే అంజలి చెంతకి జనం గుంపులుగా వచ్చి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

- మొలకలపల్లి కోటేశ్వరరావు, 81068 45 478