Oct 29,2023 07:33

వరుస కట్టిన కూలీలు వెదురుచేటల్తో నూర్చిన పంట ఎగరబోస్తూ ఉంటే.. తూర్పుగాలి రెపరెపల జోరుకి వాళ్ల కాళ్ల కింద ధాన్యం రాశి ఎత్తు క్షణక్షణానికి పెరిగిపోతోంది. ప్రభాత కిరణ కాంతులకు ఆ ధాన్యపుమేటు అచ్చంగా మేలి పర్వతంలాగే ప్రకాశిస్తోంది. పనిలో ఊతంగా కూలీలు పాడుతున్న జానపదాలకి అక్కడున్న గొంతులతో పాటు, కాళ్లూ, చేతులూ శృతి కలుపుతున్నాయి. కాస్త దూరంగా చేల మధ్యలోంచి పట్టాల మీద వెళుతున్న రైలు కూత కూడా పాటలకి కోరస్‌లా వినిపిస్తోంది. పొలాలను ఒరుసుకుంటూ పారుతున్న నీటి వాగు.. దానిలో విసురు వలలతో చేపలు పడుతున్న నావలు వాళ్లు, ఎగిరి పడుతున్న ధాన్యపు గింజల కోసం.. ఎగిరొస్తున్న రామచిలుకలు, పిచ్చుకల్లాంటి విహంగాలు, చల్లని గాలి, నల్లని మబ్బులు.. ఆ ప్రాంతమంతా ఎటు చూసినా ప్రకృతి రమణీయతే! అక్కడ పల్లె అందాలు, పసిడి పొలాల.. మనోహర దృశ్యం కళ్ళను కట్టిపడేస్తున్నాయి.
                                                                     ***********************************
ఊరి ఏటిగట్టు చెట్టు కింద రచ్చబండ మీద కూర్చుని రోజూలాగే కృష్ణారావు, తోటి రైతులు ముచ్చట్లాడుకుంటున్నారు. తల పాగా చుట్టుకుని, చేతిలో దుడ్డి కర్రతో.. కురసగా ఉన్న చందర్రావు గబగబా డెక్కుకుంటూ వచ్చి, 'తమరి కోసం పట్నపోళ్ళెవరో? కారులో వస్తున్నారండి' అని గట్టిగా అరిసాడు. నిజానికి అతను అరవలేదు.. చెప్పాడంతే! అతని మాట తీరే అంత. ఏంచెప్పినా అరిసినట్టే ఉంటది. రైతులందరికీ సుపరిచితమైన చందర్రావు పశువుల కాపరి. రచ్చబండ దగ్గర దుడ్డికర్రతో మూడు కాళ్ల మనిషిలాగా నిలబడి తెలిసినా? తెలియకపోయినా? మధ్య మధ్యలో వాళ్ల మాటల్లోకి దూరిపోతుంటాడు. అది అతడి నైజం.
ఇంతలోనే ఖరీదైన కారొకటి వాళ్ళ దగ్గరి రానే వచ్చింది. ముందు సీట్లోంచి ఓ పెద్దాయన, వెనుక నుంచి మరి కొంతమంది దిగారు. వాళ్లు తగిలించుకున్న బ్యాగులు, చేతుల్లో ఉన్న ఫైళ్లు, కట్టుకున్న బట్టలు.. వాలకము చూస్తే! నగరం నుంచి వస్తున్న చదువుకున్న పెద్దోళ్లులాగే అనిపించింది. ఎకాఎకీన రచ్చబండ దగ్గరకే వచ్చేశారు. రెండు చేతులు జోడిస్తూ 'మీరేనా కృష్ణారావుగారు?' అని అడిగాడు పెద్దాయన. కృష్ణారావు లేచి నిలబడి నేనే అన్నట్టు తలూపి.. వాళ్లకి ప్రతినమస్కారం చేశాడు. అక్కడున్న సిమ్మెంటు బండమీద 'కూర్చోండం'టూ చేయి చూపిస్తూ వారికి స్వాగతం పలికాడు. కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరూ మాట్లాడం లేదు.
'చల్లకొచ్చి ముంత దాస్తారెందుకు? ఇక్కడికి ఏ పనిమీదొచ్చారు? మీరెవరు? సెలవివ్వండి?' అన్నాడు చందర్రావు నిర్మొహమాటంగా. అతని మాటలకి వాళ్లు స్పందించారు. చిరునవ్వుతో తమదైన శైలిలో పరిచయాలు చేసుకున్నారు. వాళ్ల చెప్పే విధానం అక్కడ అందరినీ కట్టిపడేస్తోంది. మాట్లాడుతూనే సంచిలోంచి ల్యాప్టాప్‌ తీసి డెమోలాంటి పది నిమిషాలు నిడివున్న వీడియో చూపించారు. వాళ్లు కృష్ణారావు మీదే ఫోకస్‌ పెట్టి మాట్లాడుతున్నారు. వీడియో పూర్తయ్యింది. లాప్టాప్‌ మూసేశారు. ఇక ఒకరి తర్వాత ఒకరు ఉపన్యాసం మొదలుపెట్టారు. గ్రామాబివృద్ధికి వరాల ప్రకటించారు. ఊరి రూపురేఖలే మార్చేస్తామని చెప్తున్నారు. వాళ్ల మాటలు గ్రామస్తుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఊరి స్థితి, పరిస్థితి మారిపోద్దని ఊహల్లో చూపిస్తున్నారు. 'మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తుకిదో సువర్ణవకాశం' అని పదేపదే చెవిలో బాకా ఊదినట్టు చెబుతున్నారు. వాళ్ల మాటలకి అందరిలోనూ ఉత్సాహం ఉప్పొంగిపోతోంది. ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అక్కడ రైతాంగమంతా ఒకరికొకరు 'సరే' అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. 'మీరంతా కూర్చుని, చర్చించుకుని, సమాలోచనతో ఒక నిర్ణయం తీసుకుని చెప్పండి? ఒకవేళ మీకు కుదరకపోతే! మేం ఇంకో ఊరు చూసుకుంటాం. మీ సమాధానం మాత్రం మాకు తొందరగా చెప్పాలి' అంటూ లేచి.. కృష్ణారావుకి ఒక విజిటింగ్‌ కార్డిచ్చి వెళ్ళిపోయారు వాళ్లు. కృష్ణారావు వాళ్ళ మాటలు విన్నాడు తప్ప, వాళ్లకి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భుజం మీద ఉత్తరీయం సర్దుకుని, మౌనంగా ఇంటివైపు అడుగులు వేశాడు. 'ఈనేంట్రా ఏమీ మాట్టాడ్డూ' అనుకుంటూ మిగతా రైతులు పంచెలు బిగించుకొని, ఎవరికి వాళ్లు ఇళ్ల దారి పట్టారు.
                                                                           *********************************
వెంకాయమ్మపేట గోదారిపాయ తీరాన పచ్చటి పల్లె. కృష్ణారావు ఆ ఊళ్ళో పాతికెకరాల మాగాణి ఉన్న రైతు. గోదారి నీళ్లల్లే తియ్యటి మనసు ఆయనది. అందరి కష్టసుఖాల్లోనూ, పేదలను ఆదరించడంలోనూ ముందుండే మనిషి. మాటకారి. ఊరి బాగోగులు కోరే వ్యక్తి. ఏ సమస్య వచ్చినా గ్రామస్తులు ఆయన దగ్గరికే వస్తారు. వరి, కూరగాయలు, వాణిజ్య పంటలు, పూల తోటలు మెండుగా పండే సారవంతమైన భూమి ఆ ఊరి నేల. సేద్యమే వాళ్ల ప్రధాన జీవనాధారం. కష్టానికి వెనుకాడరు. కల్మషం లేని మనుషులు వాళ్లు.
                                                                            **********************************
ఆమర్నాడే కృష్ణారావు నేతృత్వంలో గ్రామ ప్రముఖులు, రైతులు సమావేశమయ్యారు. రైతు సూర్రావు కాపు లేచి 'వాళ్ళు చెప్పినట్టు మన పొలాలన్నీ పాలిమర్‌ ఫ్యాక్టరీకిచ్చేస్తే మన ఊళ్ళో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలొస్తాయి. మనకి డబ్బు కూడా బానే ముట్టజెప్తానంటున్నారు. నన్నడిగితే పొలాలు వాళ్ళకమ్మేయడమే మంచిది' అన్నాడు.
వెంటనే మరో రైతు..సుబ్బారావు అందుకున్నాడు 'నా ఒగ్గానొక్కొడుకు ఎక్కడో? దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్యాక్టరీ వస్తే వాడు ఊళ్లో మా కళ్ళ ముందే ఉద్యోగం చేస్తాడు. నేను నా పొలం వాళ్లకమ్మేయడానికి సిద్ధం. మిగతావాళ్ళు కూడా ఇచ్చేస్తే ఊరు బాగుపడద్ది' అన్నాడు.
'సొమ్ములు లేక నా కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను. నా చేనుకి ఇంత డబ్బెవరిస్తారు? అందుకే నేను కూడా చేను ఫ్యాక్టరీ వాళ్ళకే అమ్మేయాలనుకుంటున్నాను' అన్నాడు ఇంకో రైతు మాచరయ్య. ఒకరిని తరువాత ఒకరు అందరూ వాళ్ల పొలాలను ఫ్యాక్టరీ వాళ్లకి అమ్మేయడానికే మొగ్గు చూపుతూ మాట్లాడారు. తలో మాటతో కాస్త గందరగోళం చెలరేగింది.
'అందరూ మాట్లాడుతున్నారు. కానీ పెద్దాయన నోరు విప్పరే' అంటూ పరోక్షంగా కృష్ణారావుని ఎద్దేవా చేశాడు వయసులో పెద్దయిన పెదిరాజు. 'అందరి శ్రేయోభిలాషి కృష్ణారావు గారు. ఊరికి ఇంత మంచి జరుగుతుంటే ఆయన మాత్రం కాదంటారా? మన మాటే ఆయన మాట. మౌనం అంగీకారం' అంటూ ఇంకా ఏవేవో మాట్లాడబోతున్న సుబ్రహ్మణ్యం భుజం మీద చేయి వేసి, నెమ్మదిగా పైకి లేచాడు కృష్ణారావు. సుబ్రహ్మణ్యానికి విషయం అర్థమై, మాటలు ముగించి వెంటనే కూర్చున్నాడు.
మాటలు సర్దుమణిగి అంతా ఒక్కసారిగా ప్రశాంతత. కంఠం సవరించుకున్న కృష్ణారావు 'లాభాలు బేరీజు వేసుకోవటానికి మనమేమన్నా వ్యాపారస్తులమా? పాడిగేది ఒట్టిపోయినా? కడతేరే రకూ కడుపు నిండా తిండిపెట్టి పెంచే మనసున్న మహారాజులం.. రైతు బిడ్డలం. మనం తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఊళ్లోనే ఉంటున్నాం. ఈ నేల తల్లి ఒడిలో, ఆ గోదారమ్మ సేదలో బతుకుతున్నాం. అప్పుడప్పుడూ చిన్న చిన్న ఎద్దళ్ళు తప్ప ఎప్పుడైనా మనం తిండికి కరువు పడ్డామా? మన ఆనందాలకి, అనుబంధాలకి బంధం ఈ నేలే కదా? ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరీ కోసమని కార్పొరేటోళ్ళకి కట్టబెట్టేస్తే ఎలా? ఇక ఈ ఊళ్లో మనం ఉండగలమా?' అన్నాడు కృష్ణారావు.
'ఊరికి బోలెడన్ని వసతులు కల్పిస్తామంటున్నారు. వాటిని మనం పోగొట్టుకుంటే ''సిరోస్తే మోకాలొడ్డి నట్టే'' కదా అన్నాడు' మరో రైతు అప్పారావు.
'గోదారమ్మ కనికరించాలిగానీ వాళ్లు కల్పించే సౌకర్యాలు మనకో లెక్కా' అన్నాడు కృష్ణారావు.
'ఫ్యాక్టరీ వస్తే బోలెడంత మందికి ఉద్యోగాలొస్తాయి, పని దొరుకుతుంది. ఏటెలకాలం ఊరు ఇలానే ఉండిపోతే ఎలా? అబివృద్ధి చెందొద్దా? కాస్త ముందుచూపుతో ఆలోచించండి కృష్ణారావు గారు' అన్నాడు మరో రైతు.
'పచ్చని పొలాలు చిదిమేసి, కాంక్రీటు కట్టడాలు కట్టేస్తే ఊరి అభివృద్ధి జరిగిపోయి, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అనుకుంటే పొరపాటే!' అని కృష్ణారావు చెప్పేలోపే..
'సార్‌ ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతోంది. మీరు ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నారు. ఊర్లో ఫ్యాక్టరీ వస్తే. గ్రామంతా అభివృద్ధి చెంది, నెట్‌ కేఫ్లు, మల్టీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, డిజిటల్‌ థియేటర్లు, కాస్మోటిక్‌ సెంటర్లు, హెల్త్‌ క్లినిక్లు ఎన్నెన్ని వస్తాయో మీకు తెలుసా? అంకుల్‌ గారు!' అన్నాడు పట్నంలో సాఫ్ట్వేర్‌ ఉద్యోగం చేస్తున్న రమేష్‌.
'నీవు చెప్పేది కరెక్టే రమేష్‌. పంట పొలాలన్నీ పరిశ్రమలైపోతే! పల్లెలన్నీ పట్నాలైపోతే మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు పల్లెలు పట్నాలు రెండూ ఉండాలి. ఈ జగతి నడవాలి అంటే.. కొంత వైవిద్యం ఉండాలి. చదువుకున్నవాడివి నీలాంటి వాళ్లు తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా.. భావితరాల గురించి కాస్త ఆలోచించాలి' అన్నాడు కృష్ణారావు.
వెంటనే కొండయ్య లేచి కాస్త కోపంగా 'కేవలం మీ స్వార్థం కోసం మీరు వ్యతిరేకిస్తున్నారు. మీరు భూస్వాములు. ఎలాగైనా బతికేస్తారు. ఎకరం, రెండెకరాలు జాగాలు ఉన్న సన్నకారు రైతులం మేం. పండిన పంటకి గిట్టుబాటు లేక, ఉన్నదాంతో బతకలేక, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. మేం భూమిని అమ్ముకొని, ఫ్యాక్టరీకి ఇస్తేనే మా బతుకులు బాగుపడతారు' అనేశాడు.
కృష్ణారావు నవ్వుకుంటూ తన పొలంలో ఉద్ధారకత్వం చేసే గంగరాజుని పిలిచాడు. అతను కృష్ణారావుకి నమ్మిన బంటు. పొలం పనులు, ఇంటి పనులు అన్నీ అతని చేతి మీదే జరుగుతాయి. ఊరి జనానికి కూడా సుపరిచితుడు. తన్ని గంగయ్యని కూడా చాలామంది పిలుస్తారు. కృష్ణారావుపై మాటల యుద్ధం ఎక్కుపెట్టిన కొండయ్యకి, గంగరాజు స్వయానా బాబారు.
'నిన్న ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్‌ చేసి నాతో ఏమన్నారో? ఒకసారి వీళ్ళందరికీ అర్థం అయ్యేలా చెప్పు గంగయ్యా' అన్నాడు కృష్ణారావు.
గంగరాజు వెనుక నుంచి జనం మధ్యకి వచ్చాడు. రాత్రి ఫ్యాక్టరీ వాళ్లు కృష్ణారావుతో చెప్పిన విషయాన్ని పూసగుచ్చినట్లు ఇలా చెప్పాడు. 'కృష్ణారావు గారూ మీ గ్రామం అందరిలో బుర్రన్న మనిషి మీరు. మీరు ఊ అంటే.. మాకు పనైపోద్దండి. ఏదోలా మీరే మీ ఊరి పొలాలు ఫ్యాక్టరీకి ఇచ్చేట్టు చూడాలి. మీ మేలు ఊరికినే ఉంచుకోంలేండి! మీ పొలానికి అందరికీ ఇచ్చిన రేటు కంటే రెట్టింపు చెల్లిస్తాం. మా కంపెనీ ఆరు రాష్ట్రాల్లో ఉంది. చాలా పెద్దది.. మీకూ తెలుసు. అలాగే ఫ్యాక్టరీ నిర్మాణంలో మీకొక సివిల్‌ కాంట్రాక్ట్‌ కూడా ఇప్పిస్తాం. మీరు రికమండ్‌ చేసినవాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక కోటి రూపాయలు నజరానా ఉంటుంది. ఒక కారు గిఫ్ట్‌ కూడా ఉంటుంది. మేము ఇన్నిచోట్ల ఫ్యాక్టరీలు పెట్టగలుగుతున్నామంటే.. నడప గలుగుతున్నామంటే మీలాంటి వాళ్ళ సహకారమే కదా?! మీకు మా ఫ్యాక్టరీ ఎప్పుడు లాయల్‌గానే ఉంటుంది. మా నుంచి ఎలాంటి సాయాన్నైనా పొందొచ్చు. వీలైనంత తొందరగా పని కానిచ్చేయండి సార్‌. మీ ఊర్లో మీ మాటకి తిరుగులేదు లెండి!' అంటూ ముగించాడు గంగరాజు. గంగయ్య మాటలకి వాళ్లంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
కృష్ణారావు 'ఇప్పుడు చెప్పండి నేను స్వార్థపరుణ్ణా?' అనేసరికి, అప్పటివరకు ఆవేశంతో ఊగిన వాళ్లంతా బిక్కమొహాలు వేశారు. 'మీ మాటల్ని నేనేమీ తప్పు పట్టడం లేదు. అలా అని మీపై కోపమూ లేదు. మీకుండే సాధక బాధలు, పరిస్థితులు అలా మాట్లాడిస్తారు. ఫ్యాక్టరీ పెడితే ఉపాధి దొరుకుతుంది, నిజమే!. కానీ సుఖం, సంతోషం, ఆరోగ్యం ఆహ్లాదం, ఆనందం ఇవి కూడా జీవితంలో ఉండాలి. మనందరికీ ఇప్పుడవి మెండుగా ఉన్నాయి. సమస్యలంటారా? ఎంత గొప్పవాళ్ళకైనా? అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. కష్టనష్టాల్ని నెగ్గించుకుంటూ గడపడమే జీవిత పరమార్థం. ఇప్పుడు ఫ్యాక్టరీ అన్న ప్రస్తావన రాకపోతే! అసలు వాళ్లు మన దగ్గరికి వచ్చుండకపోతే మనం ఏం చేసేవాళ్ళం? బతకలేమా? బాధలు, బందీలు అనేవి చాలావరకూ మన మనసులోనే ఉంటాయి.. మన ఆలోచనతీరులోనే ఉంటాయి. ఫ్యాక్టరీ అనుకుంటున్నాము కానీ. దాంతోపాటు వచ్చే పరిణామాలు కూడా మనం ఊహించాలి. పాలిమర్స్‌ ఫ్యాక్టరీ రాగానే వెంటనే విషవాయువులు లీక్‌ ప్రమాదం పొంచి ఉంటుంది. విడుదలైన వ్యర్థ జలాలు మన గోదావరి పాయలో కలిసి, మన నీళ్లను విషతుల్యాలుగా మార్చేస్తాయి. ఇక దాని నుంచి నిత్యం ఉద్ఘారమయ్యే పొగలో కాలుష్యం, ధూళి మనమే పీల్చాలి. చెత్త, శబ్ద కాలుష్యం, ఇవన్నీ నిరంతరాయంగా మన గ్రామంపై దాడి చేస్తూనే ఉంటాయి. ఏళ్ల నుంచి పెరిగిన ఈ పెద్ద పెద్ద వృక్షాలు, ఈ కొండలు గుట్టలూ అన్నీ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత కనుమరుగైపోతాయి. ఊరి స్వరూపమే మారిపోద్ది. ఇప్పుడున్న స్వచ్ఛత, పచ్చదనం, చల్లదనం, ప్రకృతి రమణీయత ఏమీ కనిపించవు. పరిసరాలతో పాటు మనమూ మారిపోవచ్చు. ఫ్యాక్టరీల్లో యంత్రాల్లాగా మన మనసులూ యాంత్రికంగా మారిపోతాయి. ఇప్పటి నవ్వులు, ఆత్మీయతలు, ఆర్ద్రత, అనుబంధాలు, సత్కాలక్షేపాలు ఆ తర్వాత ఉండకపోవచ్చు. మీరొకటి గమనించాలి. ఇప్పుడు శ్రీమంతులంతా ఫామ్‌ హౌసులని, ఎస్టేట్లని, విల్లాలని పేర్లు పెట్టుకుని నిశ్శబ్దంగా పొలాల్లోని, పల్లెల్లోని కాలుష్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మనమేమో ఉన్న వాతావరణాన్ని పాడుచేసుకుని.. పట్నాలని, ఫ్యాక్టరీలని జోగుతున్నాం. ఇప్పుడు చెప్పండి మనకి ఫ్యాక్టరీ కావాలా ఇప్పటిలాగే.. ఎప్పటికీ ఆత్మీయంగా, స్వచ్ఛమైన బతుకు కావాలా? మీరే తేల్చుకోండి! మా పెద్దబ్బాయి ముంబై జూట్‌ మిల్లులో ఉద్యోగం.. మీకు తెలుసుగా?!. మా చిన్న కోడలు ఢిల్లీ చక్కర ఫ్యాక్టరీలో సీనియర్‌ కెమిస్ట్‌. ఊర్లో ఫ్యాక్టరీ వచ్చేస్తే నాక్కూడా బిడ్డలంతా ఇక్కడే ఉంటారు. సమాజానికి ఫ్యాక్టరీలు కూడా అవసరమే. వద్దని నేనను. కానీ పండే భూముల్లో కాకుండా.. బంజర నేలల్లోనూ, పట్నాల్లోనూ, కొండ నేలల్లో జనావాసాలకు దూరంగా ఇండిస్టియల్‌ క్యారిడార్లలో ఉంటే అందరికీ శ్రేయస్కరం' అనేసి కృష్ణారావు కూర్చుండిపోయాడు.
కృష్ణారావు మాటలు వాళ్ళ మనసుల్ని తాకాయి. అందరూ ఆలోచించారు. కృష్ణారావు చెప్పిందే వాస్తవం అన్న నిర్ణయానికి వచ్చారు. 'పెద్దలు.. అనుభవజ్ఞులు.. ఎప్పుడూ గ్రామం శ్రేయస్సు కోరేవారు. మీ మాటే! మా మాట సార్‌! ఇక ఊళ్లోకి రావద్దని ఫ్యాక్టరీ వాళ్ళకి ఫోన్‌ చేసి చెప్పేయండి సార్‌' అన్నారు వాళ్లంతా.
'కంగారు పడకండి నేను మాట్లాడుతాను' అనేసి ముగించాడు కృష్ణారావు.
                                                                                    ***********************
ఫ్యాక్టరీ మేనేజర్‌ వైవి రావు, సిఎస్‌ఆర్‌ మేనేజర్‌ తాతారావు మర్నాడు ఒక బ్రీఫ్‌కేస్‌తో కృష్ణారావు ఇంటికొచ్చారు. ఆయనకి బొకే ఇచ్చి నమస్కారించారు. వాళ్లని చిరునవ్వుతో స్వాగతించిన కృష్ణారావు 'రండి పొలం వెళ్లొద్దాం!' అంటూ తీసుకెళ్లాడు. అక్కడ కుప్పగా వేసిన వరి పంటను నూరుస్తున్నారు. కూలీలు, చుట్టుపక్కల రైతులు, ధాన్యం కొనుగోలు దారులు, గ్రామంలో వృత్తి పనివాళ్ళు, కళాకారులతో నూర్పిడి కళ్ళం అంతా కోలాహలంగా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు నిమగమై ఉన్నారు. పొలంలో వాగు గట్టుమీద రావి చెట్టు కింద రాతిబండ పైన గడ్డి పరిచి, దానిమీద పరిచిన గోనె సంచులతో అక్కడ ఒక పాన్పు సింహాసనంలా ఉంది. అది కృష్ణారావు, మిత్రులు కూర్చునే జాగా. తనతో పాటు వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టాడు కష్ణారావు. ఒకపక్క జాలువారే నీటిలో నావ ప్రయాణాలు, మరోపక్క కూ...కూ.. చుకు చుకు మంటూ రైళ్లూ, చల్లగా సేద తీరుస్తున్న పిల్లగాలులు, పక్షుల స్వైరవిహారం. అక్కడి వాతావరణం వాళ్ళ కళ్ళను కట్టిపడేస్తోంది. ఇంతలో శంకరుడు గబగబా అరిటాకు కోసేసి, వాటిలో కేకుల్లాంటి జున్ను ముక్కలు పెట్టి, తాటిబద్ధల్ని స్పూన్లుగా చెక్కేసి, వాళ్ల చేతులకి అందించాడు. వాళ్లు కాస్త మొహమాట పడుతుండగా 'తినండి స్వచ్ఛమైన బెల్లం, కమ్మని పాలతో చేసిన జున్ను. కల్తీ లేనిది రుచి, ఆరోగ్యం కూడా' అన్నాడు కృష్ణారావు. అది తింటుంటే ఎంత మధురంగా ఉందో వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తోంది.
సూరిబాబు మద్ది ఆకుల్లో బొప్పాయి ముక్కలు వేసి వాళ్లకిచ్చాడు. ఇంత మధురమైన బొప్పాయి పళ్ళు తాము ఎప్పుడూ తినలేదని వాళ్లు సూరిబాబుకి కితాబిచ్చారు. ఆ రోజంతా పొలాల మధ్య జరుగుతున్న పనులను చూసి.. వాళ్లు కృష్ణారావుతో 'మానవ మనుగడకి మూలాధారమైన తిండినిచ్చే పంట పొలాల్లో జరిగే ప్రతి సన్నివేశమూ ఒక పండగలా ఉంది' అన్నారు.
'అవును.. దుక్కు దున్నితే పండగ, నారు పోస్తే పండగ, నాట్లు వేస్తే పండగ, చేను కోస్తే పండగ, కుప్పనూరుస్తే పండగ. చదువుకున్న వాళ్లే వ్యవసాయం దండగ, నమ్ముకున్న భూమిని అమ్ముకుంటుంటేనే పండగంటున్నారు. భవిష్యత్‌ తరాలు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుందండి! కార్మిక, కర్షక శ్రమ జీవన సౌందర్యంతో తొణికిసలాడే ఇలాంటి సజీవ చిత్రాలు చెరిపేసి... పొగ గొట్టాల ఫ్యాక్టరీలు నిర్మించేస్తే మాలాంటి హృదయాలు కాంక్రీట్‌ కట్టడాలైపోతాయంటూ' అంటూ కృష్ణారావు కళ్ళు అర్ద్రత చమర్చాయి. ఆయన తమాయించుకునేలోపు సైదులు కొబ్బరి బొండాలు చెక్కేసి, బొప్పాయి కాడల్ని స్ట్రాల్లాగా మలిచి.. 'తాగండి బాబు స్వచ్ఛమైన తీయని కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు!' అంటూ వాళ్లకి ఇచ్చాడు.
కొబ్బరినీళ్లు తాగేసి వాళ్లు ఉన్న ఫళంగా ఒకసారిగా లేచి, కృష్ణారావు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు. 'ఇకపై ఏ పంట పొలాన్నీ పరిశ్రమలకు రికమండ్‌ చేయం. రైతు వర్ధిల్లాలి!' అంటూ కారెక్కేశారు.


- చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506