Mar 13,2023 08:07

బురద మడుల్లో ఆడపడుచులు
చందమామల నడుముల్ని వంచి
వరినాట్లకు పాటల ఊపిర్ని పోస్తుంటే

చివర్లో
తియ్యటి పాటలు కాస్తాయనుకున్నా..!
కానీ,
ఎండిన, దిక్కుమాలిన రాకాసి కొమ్మకు
ఉరేసుకున్న దేశం కింద
ఏడుపై వస్తుందని
ఊహించలేకపోయాను!
'ప్రపంచం పెద్ద ప్రశ్నార్థకం
తెగ నలిగిపోతున్న చిన్న బిందువు రైతు'!

పుడమి చేయితో
పచ్చజెండాను నిరంతరం ఊపుతూ
లోకాన్ని కదుపుతూ
కాలం గొంతులో
అన్నం ముద్దై అడ్డుపడుతున్నాడు
నీళ్ళ కోసం
ఆయాసంతో తహతహలాడిపోతున్నాడు
అధిరోహించే ప్రతి పర్వతం
అగ్నిపర్వతమవుతుంది
కార్పొరేట్ల ఫొటోలకు
ఉరితాళ్ళే అందమైన ఫ్రేములు...!
ఏ కొమ్మను చూసినా
గుండెలు తరుక్కుమంటున్నాయి...
రైతు పుడమిని సంతోషంగా
తనివి తీరా వాటేసుకోవాలని పోతే
అక్కడికక్కడే మాయమవుతున్నాడు
ఎండమావై ..!
 

- శీర్పి చంద్రశేఖర్‌
63050 50953