దివ్య నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయి. ప్రతి రోజూ పడుకునే ముందు వాళ్ళ తాతయ్య మంచి మంచి కథలు చెబుతాడు. వాటిని విని తన మిత్రులకు చెబుతుండేది. అలా ఒకనాడు తాతయ్య... ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రం ఉంటుందని, అది చందమామ పక్కనే ఉంటుందని, అది మనం కోరుకున్న కోర్కెలను తీరుస్తుందని ఓ కథ చెప్పాడు. కానీ, మనం కోరే సమంజసమైన కోరికలు మాత్రమే తీరుస్తుందన్నాడు.
ఓ రోజు ఆకాశంలో మిలమిల మెరుస్తూ నక్షత్రం కనిపించింది దివ్యకు. వెంటనే తన మనసులో మంచి బట్టలు కావాలని కోరుకుంది. వద్దు... వద్దు... బంగారు ఆభరణాలు కావాలని కోరుకుంది. కొన్ని సెకనులు ఆలోచించి తాతయ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది. సమంజసమైన కోరికలు మాత్రమే కోరుకోమన్నారు కదా! అనుకుంది. అప్పుడు మళ్లీ కళ్లు మూసుకుని అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వమని కోరుకుంది.
అంతలో ధగధగ మెరిసిపోతున్న ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. 'దివ్యా! నీ సమంజసమైన కోరికకు మెచ్చి నీ ముందుకు వచ్చాను. ప్రకృతి అమ్మలా అందరినీ కాపాడుతోంది. కానీ మానవుడే అహంకారంతో దాని వినాశనానికి దారి తీయిస్తున్నాడు. కాలుష్యాన్ని పెంచుతున్నాడు. ఎప్పుడైతే చెట్లు పెంచి, తన తోటి పశు పక్షులను బాగా చూసుకుంటాడో, అప్పుడు తప్పక అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ప్రకృతిని రక్షిస్తే అదే మనలను రక్షిస్తుంది.' అని మాయం అయ్యింది.
దివ్య వెంటనే తాను చెట్లను పెంచాలనుకుంది. ఆ మరుసటి రోజు నుంచి తన స్నేహితులతో కలిసి చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టింది. కొన్ని రోజులకు తన ఊరంతా పచ్చని వనంలాగా మారింది. దాంతో అందరూ స్వచ్ఛమైన గాలి పీల్చికుంటూ ఆర్యోగంగా ఉన్నారు.
- మానస,
5వ తరగతి, ఎంపిపి పాఠశాల,
మర్తాడు మెయిన్,
అనంతపురం.










