Oct 06,2023 10:17
  • ఆపై సక్రమంగా అందని సాగునీరు.
  • ఆందోళన చెందుతున్న తొలకరి రైతులు.

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది తొలకరి వర్షం పంటలకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. దీనికి తోడు పంట కాలువలకు సాగునీరు సక్రమంగా అందక పోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తొలకరి పంటలు పొట్ట దశకు చేరుకున్నాయి. ఇప్పుడు గింజపాలు పోసుకోవడానికి ఆపై తోడుకోవడానికి నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో గత వారం రోజుల నుండి పంట కాలవల్లో వచ్చే నీరు సాంద్రత తగ్గిపోయింది. అడుగంటిన సాగునీరుతో శివారు పంట పొలాలకు నీరు అందక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా కే గంగవరం మండలంలోని ఎర్ర పోతవరం, శివల, పేకీరు, నల్ల చెరువు పుంత, దంగేరు, కుడుపూరు గ్రామాలకు కాజులూరు మండలంలోని దుగ్గుదూరు, మేకల గురువు, ప్రాంతాలకు గల వరిచేలకు వెళ్లే కాలువలో నీటి శాతం తగ్గిపోయింది దీంతో పలువు రైతులు మోటర్లు వేసుకుని పంటచేలకు నీరు మళ్లిస్తుండగా మరికొందరు పంట కాలువల ద్వారా లభ్యమయ్యే సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. పొట్ట దశలోనూ ఈనిక దశలోనూ వరి పంటకు సాగునీరు బాగా అవసరం అవుతుంది  లేకుంటే వరి  పంటలో ధాన్యం పొల్లు ఎక్కువగా వస్తుంది. ధాన్యంలో పళ్ళు ఎక్కువ రావడంతో పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు తెలియజేస్తున్నారు. పంట కాలవల్లో సాగునీటి లభ్యత పెంచి శివారు ప్రాంతాల పంట పొలాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలనికే గంగవరం కాజులూరు మండలాలు రైతులు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. గత వారం రోజులుగా ఈ పరిస్థితి ఉందని దీని వెంటనే సరి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.