Nov 17,2023 14:15
  • తుఫాను ప్రభావంతో అప్రమత్తమైన రైతన్నలు

ప్రజాశక్తి-రామచంద్రపురం : తొలకరి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తుఫాను పొంచి ఉందన్న వార్తలతో రైతులు అప్రమత్తమయ్యారు. దీంతో వరి కోత యంత్రాలను ఉపయోగించి రైతన్నలు ముమ్మరంగా వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని వరి చేలు నుండి బయటకు తీసుకొస్తున్నారు. సాంప్రదాయ కోతలు వల్ల ధాన్యం సేకరణ మరింత ఆలస్యం అవుతుందని ఆలోచించిన రైతులు హార్వెస్టర్లతో కోతలు ప్రారంభించారు. కే గన్నవరం మండలంలోని 15 వేల ఎకరాలలోనూ, రామచంద్రపురం మండలంలోని 17వేల ఎకరాల్లోనూ వరి సాగు అవుతుంది. తొలకరి పంటలు కోత దశ చేరుకుని వారం రోజులైనా తుఫాను ప్రభావంతో రైతులు కొంత ఆలస్యంగా వరి కోతలు ప్రారంభించారు. అయితే ఆధునిక యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని వరి చేల నుండి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండడంతో అధిక సంఖ్యలో హార్వెస్టర్లను ఉపయోగించి వరి కోతలు ప్రారంభించారు. సుమారు 20 శాతం వరి కోతలు పూర్తి కాగా మరో వారం రోజుల్లో 50 శాతం మేరకు పూర్తవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని రైతుల అభిప్రాయపడుతున్నారు.