- దుండగుణ్ణి హత మార్చిన పోలీసులు
టెక్సాస్ : అమెరికాలో తుపాకీ సంస్కృతి బుసలు కొడుతున్నది. శనివారం టెక్సాస్‌లోని ఆలెన్ నగరంలోని రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్ సమీపంలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది మరణించారు. ఐదేళ్ల చిన్నారిసహా మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుణ్ణి కాల్చి చంపారు. 120కిపైగా దుకాణాలున్న మాల్ పరిసరాల్లో దుండగుడు ఈ దారుణానికి పాల్సడినట్లు నగర పోలీస్ చీఫ్ బ్రయన్ హార్వీ ప్రకటించారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారని, ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారని తెలిపారు. నిందితుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో స్థానికులు ప్రాణ భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ఈ ఊచకోతకు పాల్పడిన దుండగుడి ఉద్దేశమేమిటన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. హత్యాకాండకు ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ఇది మాటలకు అందని విషాదమని వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులకు, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికాలో ఈ ఏడాది ఇంతవరకు 128 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో పెచ్చరిల్తుతున్న తుపాకీ సంస్కృతికి ఇది దర్పణంపడుతున్నది. అమెరికా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ తుపాకీ సంస్కృతిని అక్కడి రిపబ్లికన్లు బాహాటంగా సమర్థిస్తున్నారు.