Mar 06,2023 18:16

న్యూఢిల్లీ   :  భారత్‌లో నిరుద్యోగం రేటు ఆందోళనకరంగా ఉందని తాజా సర్వే పేర్కొంది. నిరుద్యోగం రేటు 2018 తర్వాత ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని వార్షిక పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) వార్షిక నివేదిక పేర్కొంది. పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే ప్రకారం.. 2018-19లో 5.8 శాతంగా ఉన్న నిరుద్యోగం రేటు 2021-22లో 4.1శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. అదే సమయంలో మొత్తం ఉపాధిలో వ్యవసాయం వాటా పెరిగిందని తెలిపింది. ఉద్యోగాలు లేకపోవడంతో అధిక శాతం మంది వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారని, 2028-19లో 42.5 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2021-22లో 45.5 శాతానికి పెరిగినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం దేశ జనాభాలో కొంత భాగాన్ని ఇప్పటికీ దెబ్బతీస్తోందని ఈ సర్వే వెల్లడించింది.

తాజా జనాభా లెక్కలు లేకపోవడంతో ఖచ్చితమైన గ్రామీణ-పట్టణ వర్గీకరణను కష్టతరం చేసిందని జెఎన్‌యు ఎకనామిక్స్‌ విభాగంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హిమాన్షు పేర్కొన్నారు. గ్రామీణ జనాభా, శ్రామిక శక్తి వాటా పెరుగుదలల మధ్య వలసలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే ప్రకారం.. గ్రామీణ జనాభా వాటాను అనుసరించి 2021-22లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెల్లించని స్వయం ఉపాధి పొందుతున్న వారి వాటా పెరుగుతూనే ఉందని పేర్కొంది. 2004-05 మరియు 2011-12 మధ్య 58.5 శాతం నుండి 48.9 శాతం వ్యవసాయ కార్మికులలో అత్యధిక క్షీణత నమోదైందని పేర్కొంది. 2011-12లో తయారీరంగంలో పనిచేస్తున్న శ్రామిక శక్తి వాటా 12.6 శాతానికి చేరుకుందని నివేదిక పేర్కొంది.

2018 తర్వాత ఉపాధిలో వ్యవసాయం వాటా పెరిగిందని తెలిపింది. ఉపాధిలో తయారీ రంగం వాటా 2018-19లో 12.1 శాతం ఉండగా, 2021-22లో 11.6 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వ్యవసాయ రంగం నుండి అధిక శాతం మంది నిర్మాణ రంగం వైపు మళ్లారని.. అయితే రెండు తక్కువ వేతనం పొందేవేనని అన్నారు. రెండూ కూడా తయారీ రంగాన్ని అధిగమించాయని చెప్పారు. స్వయం ఉపాధి పొందే వారి వాటా 2018-19లో 52.1 శాతం ఉండగా, 2021-22లో 55.8 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగం తర్వాత తయారీ రంగం రెండవ అతిపెద్ద ఉపాధి అవకాశాలను కల్పించేదని, కానీ ప్రస్తుతం నిర్మాణ రంగం రెండో స్థానాన్ని భర్తీ చేయడంతో తయారీ రంగం నాలుగో స్థానానికి పడిపోయిందని తెలిపింది. అదే సమయంలో వారు  పొందే రోజువారీ వేతనం, జీతం వాటా 23.8 శాతం నుండి 21.5 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఆధార పడే వారి నిష్పత్తి వేగంగా పెరుగుతుండటంతో ఉద్యోగులపై మరింత ఒత్తిడి తీసుకువస్తోందని పేర్కొంది.