
చెన్నై : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలను శనివారం మధ్యహ్నం నిర్వహించనున్నారు. బీసెంట్ నగర్ శశ్మానంలో మధ్యహ్నం 12 గంటలకు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. వ్యవసాయ, పర్యావరణ రంగాల్లో ఎనలేని సేవలు చేసిన స్వామినాథన్‌ను గౌరవిస్తూ పోలీసు లాంఛనాలతో అంతిమ నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్టాలిన్ తెలిపారు. 98 ఏళ్ల స్వామినాథన్ వయస్సు రీత్యా సమస్యలతో గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వామినాథన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్)లో ఉంచారు. ప్రజలు చివరి సారిగా ఆయనకు వీడ్కోలు పలుకుతున్నారు.