Nov 18,2023 08:13
  • రైతుల పేరిట బ్యాంకుల్లో పూల్‌ అకౌంట్లు
  • 20న ఉన్నతస్థాయి సమావేశం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ విధానాన్ని అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ నెల 20 వ తేది (సోమవారం) ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో నగదు బదిలీ విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఏడాది చివరకు, నగదు బదిలీ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు అవసరమైన రీతిలో రైతుల పేరిట బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన పూల్‌ అక్కౌంట్లును క్రమబద్దీకరిస్తున్నారు.
           విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్‌డిఎస్‌ఎస్‌ (రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌) కింద వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని, పంపిణీ సంస్థలు ఖర్చు చేసిన మొత్తాన్ని వినియోగదారులు ( రైతులు ) నుండి నూరు శాతం చెల్లించి తీరాలని షరతు పెట్టిన విషయం తెలిసిందే. అక్కౌంట్ల ప్రక్రియ పూర్తయిపోతే, భవిష్యత్తులో ఎపుడైనా ప్రభుత్వం సబ్సిడీని కుదించడం లేదా ఎత్తివేయడం చేసినా, డిస్కమ్‌లకు రైతులు బిల్లులు చెల్లించాల్సివస్తుంది. లేకపోతే కరెంటు కట్‌ తప్పదు!
 

                                                                  ఏం చర్చించనున్నారు ?

ఆర్థికశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న సమావేశంలో విద్యుత్‌శాఖ, మూడు డిస్కామ్‌లు ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ఐన యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నగదు బదిలీ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాల ఏర్పాటు, నిర్వహణ, ఇప్పటికే ఏర్పాటు చేసిన ఖాతాల్లో విఫలమైన వాటిని గుర్తించడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, రైతుల ఖాతాల్లో నగదు జమచేయడానికి వీలుగా పూల్‌ అక్కౌంట్స్‌ ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో డిస్కామ్‌కు ఒక్కో పూల్‌ అక్కౌంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన రైతుల నగదు బదీలీ ఖాతాలను ప్రయోగాత్మకంగా నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటిలో ఒక వేళ ఏవైనా విఫలమైతే వాటి స్థానంలో కొత్త ఖాతాలను ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్‌ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి డెడ్‌లైన్‌గా నిర్ణయించనున్నారని తెలిసింది.
 

                                                        వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ...

విద్యుత్‌ సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు అదనపు అప్పులను అనుమతిస్తామని కేంద్రం పేర్కొంది. దీంతో ప్రజానీకంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాల కన్నా రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు వేగంగా అమలవుతుడటం గమనార్హం. రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించినా విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు ఏర్పాటు చేసింది. దీనిని అధ్యయనం చేసిన ప్రయాస్‌ (పూణె) సంస్థ వీటివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పింది. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లడం గమనార్హం.
 

                                                             ప్రత్యేక బ్యాంకు ఖాతాలు..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్‌లు రైతుల నుండి ఒప్పందాలు చేసుకోనున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగదు వేసినా వేయకపోయినా రైతుల ఖాతాల్లో నిలువ ఉన్న మొత్తం నుండి కట్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆందోళన వ్యక్తం కావడంతో ఉచిత విద్యుత్‌ కోసం ప్రత్యేక ఖాతాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 16,38,650 ఖాతాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఖాతాలను కూడా ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఏర్పాటైన ఖాతాలను పూర్తిస్థాయిలో పరిశీలించడం వంటి చర్యలను చేపట్టే అంశంపై ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినప్పటికీ విద్యుత్‌ సరఫరాను ఆపకుండా కొనసాగించాలని డిస్కమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని చెబుతున్నారు.