
చెన్నై : భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ (98) గురువారం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 'మన దేశ చరిత్రలో చాలా క్లిష్టమైన సమయంలో వ్యవసాయంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. మన దేశానికి ఆహార భద్రతకు భరోసానిచ్చింది. వ్యవసాయానికి ఆయన చేసిన విప్లవాత్మక కృషికి మించి, డా.స్వామినాథన్ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా అనేకమందికి ప్రోత్సాహకుడిగా ఉన్నారు. పరిశోధన మరియు మార్గదర్శకత్వం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత అసంఖ్యాత శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలపై చెరగని ముద్ర వేసింది. నేను స్వామినాథన్‌తో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో దేశ పురోగతి చూడాలనే ఆయన అభిరుచి ఆదర్శప్రాయమైంది. ఆయన జీవితం, వ్యవయసాయ రంగానికి చేసిన కృషి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు.