భోపాల్ : మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 39 లక్షల మంది నిరుద్యోగ యువత ఉండగా వారిలో గత మూడేళ్లలో కేవలం 21 మందికి మాత్రమే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర శాసనసభలో 230 స్థానాలు ఉండగా నవంబర్ 17న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.
2008 నుండి అంటే గత 16 సంవత్సరాలుగా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తోంది. 2018 డిసెంబర్ నుండి 2020 మార్చి వరకూ మాత్రం సీనియర్ నేత కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.
- హామీలు...ఆరోపణలు
ప్రధాన పార్టీలు రెండూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని, కులగణన చేపడతామని, ప్రభుత్వ ఉద్యోగాలలో ఒబిసిలకు 27% కోటా ఇస్తామని, రాష్ట్రంలో ఐపీఎల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జూన్‌లోనే జబల్‌పూర్ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని ఆమె ఆరోపించారు. గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 21 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని, ఈ సమాచారాన్ని తన కార్యాలయం మూడుసార్లు ధృవీకరించుకొని వాస్తవమేనని నిర్ధారించిందని ఆమె తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ గత నెల 30న గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న అలిరాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు వారు వలస పోవాల్సిన అవసరమే ఉండదని చెప్పారు. కానీ గత సంవత్సరం శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం 2022 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 25.8 లక్షల మంది నిరుద్యోగ యువత నమోదయ్యారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఆ సంఖ్య 38,92,949కి పెరిగింది. దీనినిబట్టి చూస్తే మధ్యప్రదేశ్‌లో ప్రతి నెలా లక్ష మంది నిరుద్యోగులు తయారవుతున్నారు. నమోదైన సుమారు 39 లక్షల నిరుద్యోగుల్లో గత మూడేళ్లలో కేవలం 21 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించగలిగింది. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదు. ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు మేవారమ్ జాతవ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే ఈ మేరకు సమాధానం ఇచ్చింది.